దసరా కానుకగా కొత్త పెన్షన్లు వెంటనే పంపిణీ చేయాలి
..ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు శ్రీరామ్
పానుగల్ సెప్టెంబర్ 30,జనంసాక్షి
ఆసరా నూతన లబ్ధిదారులకు దసరా కానుకగా ఆగస్టు, సెప్టెంబర్ రెండు నెలల పింఛను డబ్బులు వెంటనే పంపిణీ చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కే శ్రీరామ్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు సంతోష్ డిమాండ్ చేశారు. లబ్ధిదారులు సంబరంగా పండుగ చేసుకునేందుకు సహకరించాలని కోరారు శుక్రవారం కేతేపల్లి లో కొత్త లబ్ధిదారులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.కొత్త పింఛన్ల కోసం మూడేళ్ల క్రితం అర్హులైన వితంతువులు, వికలాంగులు దరఖాస్తు చేసుకోగా ,ఏడాది క్రితం 57 ఏళ్ల వయోవృద్ధులు పింఛన్లకు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. కొత్త పింఛన్లు ఆగస్టు నుంచి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో లబ్ధిదారుల్లో మళ్లీ కొత్త ఆశలు చిగురించాయని, దానికి అనుగుణంగానే నూతన లబ్ధిదారులకు ఆగస్టు ,2022 నుంచి పింఛన్లు ఇవ్వనున్నట్లు మంజూరి పత్రాల్లో పేర్కొన్నారని, జిల్లాలో ప్రజాప్రతినిధులు కలెక్టర్ గ్రామసభలు చేసి మంజూరి పత్రాలు పంచారని, లబ్ధిదారులు పింఛను ఎప్పుడు ఇస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నారని, ఆగస్టు తో పాటు సెప్టెంబర్ కూడా ముగిసినందున రెండు నెలల పింఛన్లు వెంటనే పంపిణీ చేసి ఆసరా లబ్ధిదారుల కళ్ళలో ఆనందం నింపాలని డిమాండ్ చేశారు. జాప్యం కొనసాగితే నూతన లబ్ధిదారులతో ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ సభ్యులు పాల్గొన్నారు.