దాడిపై దుష్పచ్రారం చేస్తున్నారు
– కేంద్రం సహాయ నిరాకరణ, ప్రతిపక్షం కుట్రలను అధిగమిస్తున్నాం
– మన స్వయంకృషితో.. రాష్ట్రాభివృద్ధి ఆగకుండా చేశాం
– కేంద్రం తీరుతో దేశ ప్రతిష్టకు భంగం
– రాజకీయ కక్షలతోనే ఐటీదాడులు
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, అక్టోబర్29(జనంసాక్షి) : ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత విూద దాడిపై దుష్పచ్రారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌పై ఆయన అభిమాని దాడికి రాష్ట్ర ప్రభుత్వానికి ముడిపెడుతున్నారని విమర్శించారు. జిల్లా కలెక్టర్లు, వివిధశాఖల ఉన్నతాధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్రం సహాయ నిరాకరణ, ప్రతిపక్షం అడ్డంకులు, కుట్రలను అధిగమిస్తున్నామని, మన స్వయంకృషితో అభివృద్ధి ఆగకుండా చూశామని ఆయన వివరించారు. వినూత్న ఆలోచనలతో సత్ఫలితాలు పొందుతున్నామన్నారు. నీరు – ప్రగతి, నరేగా కన్వర్జెన్స్ అందుకు ఉదాహరణ అని చెప్పారు. రాజకీయం, పరిపాలన రెండూ ముడిపడివుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. మంచి జరుగుతుందనే ఎన్డీఏలో చేరామని, రాష్ట్రాభివృద్ధి జరగలేదు కాబట్టే బయటకు వచ్చామని మరోసారి గుర్తు చేశారు. ప్రజల అభిప్రాయాల మేరకే ప్రభుత్వాలు నడుచుకోవాలని, తన ప్రత్యర్ధులను కట్టడి చేయడానికి వ్యవస్థలను వాడుకోవడం సరికాదని హితవుపలికారు. ఎన్డీఏలో ఉన్నంతకాలం తమపై ఐటీ దాడులు లేవని, సీబీఐలో పరిణామాలు దేశానికి అప్రతిష్ట తెచ్చాయని విమర్శించారు. కేంద్రం ఇబ్బందులు పెట్టి నైతికత దెబ్బతీయాలని చూశారని చంద్రబాబు మండిపడ్డారు.
కేంద్రం, ప్రతిపక్షాలు ఒక్కటై మూకుమ్మడి కుట్రలకు పాల్పడుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతోందని తెలిపారు. కర్నూలులో స్వైన్‌ఫ్లూ తీవ్రత పెరుగుతున్ననేపథ్యంలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.