దీపం భగవత్ స్వరూపం
హైదరాబాద్,నవంబర్6(జనంసాక్షి):దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్, దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యాదీప నమోస్తుతే’ అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే పరబ్రహ్మ స్వరూపమైన దీపం సకల చీకట్లను పారద్రోలి భగవంతుడి సృష్టిని తేజోమయం చేస్తుంది. చీకట్లో వెలుగు చూపించి, జీవనం ప్రకాశవంతంగా కొనసాగేలా చేస్తుంది. వత్తి తనను తాను కాల్చుకుంటూ లోకానికి వెలుగు నివ్వడమనే విషయం ఎందరో త్యాగధనులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. చారెడు నూనెతో రాత్రంతా వెలిగే దీపం దుష్ట శక్తులనే కాదు దురాలోచనలను రానివ్వదు. వెలుగులో మనిషి సానుకూలంగా ఆలోచిస్తాడు. చీకట్లో ఉన్నప్పుడు భయంగానో ప్రతి కూలంగానో ఆలోచిస్తాడు. దీపం వెలిగించిన చోట ఆరోగ్యం, ధన సంపదలు, శుభములు, బుద్ధి ప్రకాశం కలుగుతాయి. శుభం కరోతు కల్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు భుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే’ అని దీపానికి నమస్కరిస్తారు. శుభకార్యాల్లో దీపం వెలిగిస్తే విజయాలు కలుగుతాయని.. అది విజయ సంకేతమని పురాణాలు చెపుతాయి. ప్రతి పనిని ప్రారంభించే ముందు దీపాన్ని వెలిగించి పూజ చేయడం ఆచారం. మన జీవితంలో ముఖ్య ఘట్టాలన్నింటిలోనూ దీపం ప్రధాన పాత్ర వహిస్తుంది. మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించాలనే ఉద్దేశమే దీపం ముఖ్య అర్థం. దీపం చైతన్యానికి ప్రతీక. ఇక దీపం మరో దీపాన్ని వెలిగిస్తుంది.తద్వారా స్ఫూర్తిని పొంది,దీపం వలే మనం చెడును పారద్రోలాలి. మంచిని స్వాగతించాలి. ఆధునిక యుగంలో విద్యుత్తుతో వెలిగే కృతిమ దీపాలెన్నో ఉన్నా.. ఇప్పటికీ నూనె దీపాలను వెలిగించడం మన సంస్కృతి గొప్పతనం. మానవ జీవితంలో
దీనికి విడదీయరాని సంబంధం ఉంది. నిరంతరం మనలో స్ఫూర్తిని నింపి వెలుగు చూపే దీపాన్ని భగవత్ స్వరూపంగా భావించి ఈ దీపావళి సందర్భంగా ఆరాధించాలి. దాని వలే మానవులు అంధకారం నుంచి బయటికి వచ్చి వెలుగులు ప్రసరించాలి. పవిత్రులై ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తూ విద్యావంతులు కావాలి. దాంతో మరో దీపాన్ని వెలిగించొచ్చు. ఇలా ముందు ఒకదాన్ని వెలిగిస్తే దాందో ఎన్ని దీపాలైనా వెలుగుతాయి.అజ్ఞానపు చీకట్లపై జ్ఞానం అనే వెలుగులు విరజిమ్మాలి. వెలుగు మనిషినే కాకుండా సమస్త ప్రకృతి.. మనుగడ సాగించడానికి మార్గదర్శనం చేస్తుంది. నూనెను కర్మఫలంగా, వత్తిని శరీరంగా, జ్వాలను ప్రాణంగా భావిస్తారు. కర్మఫలం అనే నూనె ఉన్నంత వరకే వత్తి అనే శరీరంలో జ్వాల అనే ప్రాణం ఉంటుంది. కర్మఫలం పూర్తి అవగానే ప్రాణం శరీరాన్ని వదిలి పెడుతుంది. కాబట్టి జ్వాల వెలుగులో దేవుడిని స్పష్టంగా చూస్తూ, చుట్టూ ఉన్న చీకటిని తొలగిస్తాం. శరీరంలో ప్రాణం ఉండగానే అజ్ఞానమనే చీకటిని తొలగించి, మనలో ఉన్న ఆత్మని దర్శించమని దీపం అర్థం. ఒక విద్యార్థి లేదా గురువు చదువులో ఎంతో ముందుంటే వారు మరెందరికో చదువు నేర్పిస్తారు.అప్పుడే లోకం నుంచి దుఃఖం నిష్కృమిస్తుంది. అందుకు మరో మార్గం లేదు. రాక్షసత్వం ప్రదర్శిస్తున్న వారి దుశ్చర్యలకు అడ్డుకట్టవేసే ఆలోచన చేయాలి.