దేశంలో కరోనా మరణాల సంఖ్య మరణాలు ‘సున్నా’

దిల్లీ: గడచిన 24 గంటల్లో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదవ్వలేదని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది.  13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 5 లోపు మరణాలు, రెండు రాష్ట్రాల్లో పదిలోపు, మరో రెండు రాష్ట్రాల్లో 20 లోపు మరణాలు నమోదైనట్లు ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత కొన్ని రోజులుగా దేశంలో కొత్త కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. మంగళవారం క్రియాశీల కేసులు 1,47,306కు ఉండగా, బుధవారానికి ఆ సంఖ్య 1,46,907కు చేరింది. మరోవైపు కరోనా రికవరీల సంఖ్య 1,07,26,702కు పెరిగింది. రికవరీ రేటు 97.25గా ఉంది. కొత్తగా నమోదైన కేసుల్లో 86.15శాతం ఆరు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయి. మహారాష్ట్ర (6,218), కేరళ (4,034)), తమిళనాడు (442) మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరణాల్లో మహారాష్ట్ర (51), కేరళ (14), పంజాబ్‌(10) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని తెలిపారు. మొత్తంగా దేశంలో కరోనా మరణాల సంఖ్య 1,56,567కు చేరింది. మరణాల రేటు 1.42శాతంగా ఉంది.

మరోవైపు భారత్‌లో వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం వేగంగా జరుగుతోంది. బుధవారం ఉదయం 8 గంటల వరకు 1,21,65,598 మందికి వ్యాక్సిన్‌ను అందించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. వీరిలో 1,07,67,198 మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు మొదటి డోసు, 13,98,400 మందికి రెండో డోసు అందించామన్నారు. వ్యాక్సిన్‌ పంపిణీలో ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. వ్యాక్సిన్‌ మొదటిడోసు తీసుకొని 28 రోజులు పూర్తి చేసుకున్న వారికి ఫిబ్రవరి 13 నుంచి రెండో డోసు అందిస్తున్నారు. 39వ రోజు వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 2,79,823 మందికి మొదటి డోసు, 1,40,223 మందికి రెండో డోసును అందించామని అధికారులు తెలిపారు.