దేశం పీచేముఢ్
` మోదీ పాలన తిరోగమనం
` సీడబ్ల్యూసీ ఫైర్
హైదరాబాద్(జనంసాక్షి): అణగారిన వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి, ఆహార భద్రతను పదిలపరిచేందుకుగానూ కులగణనతోపాటు జనాభా లెక్కల ప్రక్రియ ను వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు.దేశం తీవ్రమైన అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. స్థానికంగా చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలు.. భారత ప్రగతిశీల, లౌకిక ప్రతిష్ఠను దిగజార్చుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే భాజపా అగ్నికి ఆజ్యం పోస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తోన్న సీడబ్ల్యూసీ సమావేశాల్లో భాగంగా ఖర్గే ప్రారంభోపన్యాసం చేశారు.’దేశం ప్రస్తుతం అనేక తీవ్ర అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పెరుగుతోన్న నిత్యవసరాల ధరలు, విస్తరిస్తున్న అసమానతలు, రైతులు, కార్మికుల జీవితాల్లో క్షీణిస్తోన్న పరిస్థితులను నియంత్రించడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చైనా ఆక్రమణల విషయంలో నిర్లక్ష్యం దేశ భద్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తుంది. మణిపుర్‌లో జరుగుతోన్న విషాదకర ఘటనలను యావత్ దేశం గమనిస్తోంది. అక్కడి మంటలు హరియాణాలోని నూప్‌ాకు పాకేందుకు మోదీ ప్రభుత్వమే కారణం. ఇటువంటి ఘటనలు ఆధునిక, ప్రగతిశీల, లౌకిక భారత ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీ, మతతత్వ సంస్థలు, విూడియాలోని ఓ వర్గం అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి’ అని ఖర్గే ఆరోపించారు.దేశంలోని సమస్యలపై ‘ఇండియా’ కూటమికి చెందిన 27 పార్టీలు ఏకతాటిపై ఉన్నాయని ఖర్గే చెప్పారు. మూడు విజయవంతమైన సమావేశాల అనంతరం ప్రతిపక్ష కూటమి.. ప్రజావ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక భాజపా ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ముందుకు సాగుతోందన్నారు. దీంతో కలత చెందిన భాజపా ప్రభుత్వం.. ప్రతిపక్ష పార్టీలపై ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను అణచివేసేందుకు భాజపా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. అధికార పార్టీ ఉద్దేశాల విషయంలో ఆందోళనలు రేకేత్తిస్తున్నాయని మండిపడ్డారు.ఇదిలా ఉండగా.. అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల రోడ్‌మ్యాప్ ఖరారుకు, లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీసమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా ముఖ్య నేతలకు రాష్ట్ర నాయకత్వం స్వాగతం పలికింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగేల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్, పార్టీ సీనియర్ నేతలు చిదంబరం, వీరప్ప మొయిలీ తదితరులు సమావేశాల్లో పాల్గొంటున్నారు.