దేశమంతా తెలిసేలా.. నిరసనలు తెలపండి

– ఏపీని అస్థిరపర్చేందుకు మోదీ కుట్రపన్నుతున్నారు
– ఏపీకి ఏంచేశారని మోదీ వస్తున్నాడు?
– నేడు నిరసన దినంగా పాటించండి
– మోదీ ద్రోహంపై ప్రతిపక్షనేత ఒక్క మాటమాట్లాడడు
– భాజపా, వైకాపా కుమ్మక్కుకు అదే రుజువు
– రఫేల్‌ వ్యవహారంలో పీఎంవో జోక్యం దేశానికే అప్రతిష్ఠ
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
హైదరాబాద్‌, ఫిబ్రవరి9(జ‌నంసాక్షి) : విభజన సమయంలో ఇచ్చిన హావిూలను అమలు చేయకుండా, ఏపీని అస్థిరపర్చేందుకు ప్రధాని మోడీ కుట్రపన్నుతున్నారని, మోదీతీరు దేశవ్యాప్తంగా తెలిసేలా నిరసనలు తెలపాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం పార్టీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అంతా పసుపు చొక్కాలు ధరించి ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని కోరారు. గాంధీజీ స్పూర్తితో ఆది, సోమవారాల్లో ఒక చీకటిదినంగా భావించి కసి పట్టుదలతో అందరూ నిరసనలు తెలపాలని సూచించారు. విభజన గాయాలపై కారం జల్లి ప్రధాని మోదీ పైశాచిక ఆనందం పొందుతున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎక్కడికక్కడ ఫ్రస్టేష్రన్‌ ప్రదర్శిస్తూ మోదీ నోరు పారేసుకుంటున్నారని, రేపు గుంటూరు వచ్చి అదే ఫ్రస్టేష్రన్‌ ప్రదర్శిస్తారని సీఎం దుయ్యబట్టారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి ఏపీ వచ్చారని, దేశమంతా తెలిసేలా నిరసనలు తెలపాలని ఆయన పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఎల్లుండి ధర్మపోరాట దీక్షకు మద్దతుగా స్థానికంగా ఎవరికి తోచిన విధంగా వాళ్లు నిరసనలు తెలపాలన్నారు. చేసిన దుర్మార్గం చూసేందుకు మోదీ వస్తున్నారని, రాష్ట్రంలో మరో వ్యక్తి ఆయనకు సహకరిస్తున్నాడని చంద్రబాబు ఆక్షేపించారు. రాష్ట్రాల్ని అస్థిర పరిచేందుకు కుట్ర పన్నుతున్నారని, ఇందుకు మానసికంగా అన్నిటికీ సిద్ధంగా ఉండాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మొన్న పశ్చిమ బెంగాల్‌లో చేశారు.. రేపు ఇక్కడా చేస్తారని.. దేనికీ అదిరేది లేదని తేల్చి చెప్పారు.
మోదీ ద్రోహంపై జగన్‌ ఒక్కమాట అనరని విమర్శించారు. భాజపా, వైకాపా కుమ్మక్కుకు అదే రుజువన్నారు. రఫేల్‌ బురదలో మోదీ కూరుకుపోయారని, దొంగే దొంగా అన్నట్లుగా ప్రధాని వ్యవహారశైలి ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రఫేల్‌ వ్యవహారంలో పీఎంవో జోక్యం దేశానికే అప్రతిష్ఠ అని మండిపడ్డారు. మోదీ అడుగులు ఆంధప్రదేశ్‌ను అపవిత్రం చేస్తాయని దుయ్యబట్టారు. జగన్మోహన్‌ రెడ్డి రెండేళ్లుగా అసెంబ్లీకి రాకుండా వైకాపా నాలుగు సెషన్లకు డుమ్మా కొట్టిందన్నారు. ఇలాంటివాళ్లు ప్రజాసేవకే అనర్హులు, రాజకీయాలకే అనర్హులని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాటలు చెప్పే నాయకులకు చరిత్రలో స్థానం లేదన్నారు. అన్ని వర్గాలకూ లబ్ధి చేకూర్చేలా విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించామన్నారు. దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ పోరాటమన్నారు. ‘రాష్ట్ర ప్రయోజనాలే మన లక్ష్యమని, హక్కుల సాధనే మన సంకల్పమని సీఎం చంద్రబాబు అన్నారు.