దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌ 

– దేశంలోకి నలుగురు ఉగ్రవాదులు
– ఐబీ హెచ్చరికలతో అన్ని రాష్టాల్ల్రో హైఅలర్ట్‌
– నలుగురి ఊహాచిత్రాలను విడుదల చేసిన ఐబీ
– గుజరాత్‌లో వీరు తలదాచుకున్నట్లు అనుమానాలు
న్యూఢిల్లీ, ఆగస్టు20(జనం సాక్షి) : నలుగురు ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని, పలు ప్రాంతాల్లో వారు విధ్వంసాన్ని సృష్టించే అవకాశాలు ఉన్నాయని ఐబీ హెచ్చరికలతో దేశవ్యాప్తంగా హై అలర్ట్‌
హెచ్చరించారు. ఆఫ్గనిస్థాన్‌ పాస్‌పోర్టులతో పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్‌ సహా నలుగురు తీవ్రవాదులు గుజరాత్‌ తీరం నుంచి భారత్‌లోకి ప్రవేశించారని దేశంలోని అన్ని రాష్టాల్రను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ నెల మొదటి వారంలోనే వారు దేశంలోకి చొరబడినట్లు తమకు కీలక సమాచారం అందిందని కేంద్ర నిఘావర్గాలు వెల్లడించాయి. ఆ నలుగురూ ఏసమయంలోనైనా విధ్వంసక చర్యలకు తెగబడే అవకాశముందని నిఘావర్గాలు ఇచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా హై అలెర్ట్‌ ప్రకటించారు. ప్రధానంగా గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రపై ఆ దుండగులు దృష్టి పెట్టినట్లు ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) హెచ్చరించింది.ఈ మేరకు గుజరాత్‌ యాంటీటెర్రరిస్ట్‌( ఏటీఎస్‌) బృందానికి సమాచారమందించింది. దుండగులకు సబంధించిన ఊహా చిత్రాలను కూడా గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులకు ఐబీ అందించింది. ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూ కశ్మీర్‌ విభజన తర్వాత.. దేశంలో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ బ్యూరో హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆగష్టు 15 సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా స్వాతంత్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకొన్నాం అని ఊపిరి పీల్చుకునే లోగానే.. ఇంటెలిజెన్స్‌ బ్యూరో మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. గుజరాత్‌ తీరం నుంచి నలుగురు అప్ఘాన్‌ ఉగ్రవాదులు, ఒక ఐఎస్‌ఐ ఏజెంట్‌ దేశంలోకి చొరబడ్డారని తెలిపింది. వీరు దాడులకు తెగబడొచ్చని హెచ్చరించింది.  దీంతో గుజరాత్‌తోపాటు దేశమంతటా హై అలర్ట్‌ ప్రకటించారు. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ సరిహద్దుల్లో ముందు జాగ్రత్త చర్యగా తనిఖీలను ముమ్మరం చేశారు. అప్రమత్తంగా ఉండాలని మధ్యప్రదేశ్‌లోని అన్ని జిల్లాల ఎస్పీలకు అడిషనల్‌ డీజీపీ కైలాశ్‌ మక్వానా నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని ¬టళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు సహా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలని నిఘా వర్గాలు కోరాయి. ముఖ్యమైన ప్రాంతాల్లో నిఘా పెంచాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ప్రశ్నించాలని, వాహనాలను తనిఖీ చేయాలని కేంద్రం సూచించింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్టాల్ల్రోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు.