దొంగాటలు వద్దు..  ధైర్యంగా రండి

– మేమేంటో.. విూరేంటో తేల్చుకుందాం
– డేటా పేరుతో దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం
– అభివృద్ధికి అడ్డుపడితే ఎవరిని వదిలిపెట్టను
– హైదరాబాద్‌ కేంద్రంగా ఏపీపై కుట్రలు చేస్తారా
– బతికున్న వాళ్ల ఓట్లను కూడా తొలగిస్తున్నారు
– ఓట్లను తొలగించడానికి ప్రశాంత్‌ కిశోర్‌ ఎవరు
– ఇది బీహార్‌ కాదు.. నీఆటలు ఇక్కడ సాగవు
– జగన్‌ గెలిస్తే నీళ్లు కూడా రావు
– మనం నీళ్లిస్తే.. జగన్‌ కన్నీళ్లు మిగులుస్తాడు
– కులాలు, మతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నా
– మోదీ, కేసీఆర్‌, జగన్‌లు కలిసొచ్చినా ఏపీని ఏం చేయ్యలేరు
– ఏపీని ఎలా అభివృద్ధి చేసుకోవాలో నాకు తెలుసు
– విూ ఉడత బెదిరింపులకు భయపడం
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
చిత్తూరు, మార్చి4(జ‌నంసాక్షి) : ఏపీలో తెదేపాను దెబ్బతీసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేసీఆర్‌, జగన్‌లు హైదరాబాద్‌, ఢిల్లీ వేదికగా కుట్రలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా డేటా పేరుతో టీడీపీ సానుభూతిపరులపై దాడులు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, దొంగాటలు వద్దు.. ధైర్యంగా రండి.. విూరేంటో.. మేమేంటో తేల్చుకుందాం అంటూ చంద్రబాబు నాయుడు సవాల్‌ విసిరారు.. మదనపల్లె గ్రావిూణ మండలం చిప్పిలిలో నిర్మించిన సమ్మర్‌ స్టోరేజ్‌ వద్ద హంద్రీ-నీవా కాలువ ద్వారా చేరుకున్న కృష్ణాజలాలకు ముఖ్యమంత్రి సోమవారం జలహారతి ఇచ్చారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించారు. అంతకుముందు చిప్పిలి సవిూపంలో విజయ పాల డెయిరీ, సహకార సంఘం ఆధ్వర్యంలో రూ.24కోట్ల వ్యయంతో నిర్మించిన టెట్రా ప్యాక్‌ యూనిట్‌కు కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌, వైసీపీ అధినేత జగన్‌ కలిసి తనను ఓడిస్తామంటున్నారని అన్నారు. తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని ఖబడ్దార్‌ అంటూ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటానని, తేడా వస్తే అంతుచూస్తానంటూ హెచ్చరించారు. కోడికత్తిని పెద్ద ఇష్యూ చేశారని, రాష్ట్రంలో పాలనలో గందరగోళం సృష్టించి ఎన్నికల్లో లబ్ధిపొందాలని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడే డేటా పేరుతో దాడులు చేస్తున్నారని అన్నారు. ఐటీ దాడులకు మేం భయపడమని, ఎనిమిది లక్షల ఓట్లను తొలగించడానికి కుట్ర చేశారని విమర్శించారు. బతికి ఉన్న వాళ్ల ఓట్లను కూడా తొలగిస్తున్నారని, ఓట్లను తొలగించడానికి ప్రశాంత్‌ కిషోర్‌ ఎవరని చంద్రబాబు ప్రశ్నించారు.  ప్రశాంత్‌ కిశోర్‌ ఆటలు ఇక్కడ సాగవని, ఇది బీహార్‌ కాదు… సైబర్‌ కైమ్ర్‌ చేసే వాళ్లను వదిలిపెట్టమని, కోర్టుకీడుస్తా మంటూ హెచ్చరించారు. ఓటు తీసేసినంత సలువుగా ఆస్తులు కూడా కొట్టేస్తారని చంద్రబాబు చెప్పారు. ఓట్ల తొలగింపుపై పోలీసులకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. జగన్‌ గెలిస్తే నీళ్లు కూడా రావని, మనం నీళ్లు ఇస్తే.. జగన్‌ కన్నీళ్లు
మిగుల్చుతాడని చంద్రబాబు దుయ్యబట్టారు. మోదీ, జగన్‌, కేసీఆర్‌ కలిసినా ఏపీని ఏం చేయలేరన్నారు. కులాలకు అతీతంగా రాష్టాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కులం, మతం చూసి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని చంద్రబాబు వివరించారు. డేటా అనేది  పార్టీ వ్యక్తిగత విషయమని, అందులో తలదూర్చితే మూలాలు కదులుతాయని హెచ్చరించారు. ఏపీ డేటాపై కేసులు పెట్టేందుకు తెలంగాణ పోలీసులు ఎవరని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధికి అడ్డుపడితే వదిలిపెట్టే సమస్యే లేదన్నారు.  వైకాపాకు చెందిన కొందరు హైదరాబాద్‌లో ఉండి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.  ఏపీ ప్రభుత్వంపై దాడి చేస్తూ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. మన ప్రభుత్వ డేటాను ఎవరో దొంగిలిస్తే హైదరాబాద్‌లో ఉన్న పోలీసులు కాపాడతారట అంటూ ఎద్దేవాచేశారు. ఎవరో దారిన పోయిన దానయ్య ఫిర్యాదు చేశారని డేటా ఉంది కదా అని ఇక్కడి ఐటీ కంపెనీలపై దాడి చేస్తారా అని సీఎం ప్రశ్నించారు.
రెండు కోట్ల ఎకరాలకు నీళ్లు ..
మదనపల్లెలో చిప్పిలి చెరువు నీళ్లు వదలడం అద్భుతమని సీఎం వ్యాఖ్యానించారు. మదనపల్లెకు నీటి కొరత లేకుండా చేస్తామని హావిూ ఇచ్చారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో నీటి సదుపాయం లేక వలసలు పోయే పరిస్థితి ఉండేదని, అలాంటి స్థితి నుంచి నేడు నిలదొక్కుకునే స్థితికి తీసుకొచ్చామని చెప్పారు. ‘నదుల అనుసంధానం కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డామని, కుప్పం కంటే ముందుగా పులివెందులకు నీళ్లు ఇస్తామని చెప్పి.. ఇచ్చిన మాట ప్రకారం నీళ్లిచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. రెండు కోట్ల ఎకరాలకు నీళ్లివ్వాలన్నదే నా లక్ష్యమని, అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, అన్ని వర్గాలను అదుకున్నమని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ నేతలు అసెంబ్లీకి రారని, అన్నింటికీ అడ్డుపడతారని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా… వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. కొందరు ఏవిూ తెలియకుండా ఏదోదే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1996లో మొట్టమొదటిసారిగా హంద్రీనీవాకు శ్రీకారం చుట్టామన్నారు. హంద్రీనీవా ద్వారా నీళ్లు తెచ్చానంటే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. అందరికీ నీటి భద్రత ఇవ్వాలనే నా లక్ష్యంమని, 12ఎత్తిపోతల పథకాలకు 550 మెగావాట్ల విద్యుత్‌ అవసరమతుందని చంద్రబాబు తెలిపారు.