దొంగనోట్ల పై ఆర్‌బీఐ ఆందోళన
ముంబయి: కొ్త్తగా చెలామణిలోకి వచ్చిన 2000, 500 నోట్లు దొంగనోట్లు ఎక్కువగా అవుతున్నాయి. . ఇటీవల వరస ఘటనలతో మేల్కొన్న రిజర్వ్ బ్యాంకు సీసీఎస్‌కు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. కలర్ జిరాక్స్‌తోనే వాటిని తయారు చేస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. నకిలీ నోట్లపై బ్యాంకులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని ఆర్‌బీఐ సూచించింది.
నకిలీలకు తావు లేకుండా భద్రతా ప్రమాణాలతో తీసుకొచ్చామని కేంద్రం ఊదరగొట్టిన కొత్త నోట్లకు నకిలీ బెడద తప్పడంలేదు. గతానికి మించి బ్యాంకింగ్ వ్యవస్థలో దొంగనోట్లు చెలామణి పెరుగుతుండటం రిజర్వ్ బ్యాంకును ఆందోళనకు గురిచేస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన 2000, 500 రూపాయల నోట్ల తయారీలో పాటించిన ప్రమాణాలపై బ్యాంకర్లకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో పెద్దయెత్తున తయారుచేసి దొంగచాటుగా దేశంలోకి ప్రవేశపెడుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకుల నుంచి రిజర్వ్ బ్యాంకుకు చేరిన కరెన్సీలో ఏకంగా 26లక్షల మేర నకిలీ కరెన్సీ ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఉన్నత ప్రమాణాలతో కూడిన జిరాక్స్ ద్వారానే ఈ నకిలీ కరెన్సీ తయారుచేస్తున్నట్లు గుర్తించారు. బయట నుంచి దేశంలోకి వస్తున్న దొంగనోట్లపై ఎన్‌ఐఏ, డీఆర్‌ఐ వంటి కేంద్ర సంస్థలు విచారణ చేపట్టి నిగ్గుతేల్చాల్సి ఉందని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. నకిలీ నోట్లను గుర్తించడంలో విఫలమైన బ్యాంకులపై అపరాధ రుసుము విధిస్తామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.