దోమల నివారణకు చర్యలు చేపట్టిన చైర్ పర్సన్ ఆకుల రజిత
హుస్నాబాద్ ఆగస్టు 07(జనంసాక్షి) హుస్నాబాద్ లోని 4వ వార్డ్ మరియు 14వ వార్డుల్లో ఆదివారం ఉదయం పది గంటల పది నిమిషాల కార్యక్రమంతో పాటు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రజిత, వైస్ చైర్మన్ అనిత, కమిషనర్ రాజ మల్లయ్యతో పాటు వార్డు సభ్యులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య మాట్లాడుతూ పట్టణ ప్రజలు తమ ఇంటిలో, ఇంటి పరిసరాలలో కొబ్బరి బోండాలు, కుండీలు, పాత టైర్లలో నీరు నిలువ లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా సీజనల్ గా వచ్చే డెంగీ, చికెన్ గున్యా లాంటి విష జ్వరాలు ప్రబలకుండా నిర్మూలించవచ్చన్నారు. నిల్వ ఉన్న నీటిలో మున్సిపల్ సిబ్బంది ఆయిల్ బాల్స్, స్ప్రే చేస్తారన్నారు. ప్రతి ఆదివారం పది నిమిషాలు తమ ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసుకోవడానికి ప్రజలు సమయాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ చైర్మన్ రజిత మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ సూచన మేరకు ఆదివారం ఉదయం పది గంటల పది నిమిషాల కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలోని నాలుగో వార్డు 14వ వార్డుల్లో దోమలు ప్రబలకుండా డ్రైనేజీ వెంబడి పారిశుద్ధ్య సిబ్బంది హైపోక్లోరైడ్ చల్లుతూ దోమల నివారణ చర్యలు చేపట్టడం, పట్టణ ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా అవగాహన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వైస్ చైర్మన్ అనిత మాట్లాడుతూ అంతరించిపోతున్న చిట్టడవులను రక్షించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమంతో తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచిందన్నారు. నాలుగో వార్డులో నాటిన మొక్కలకు స్వచ్ఛందంగా వార్డు ప్రజలే ప్రతిరోజు నీళ్ళు పోస్తామనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వార్డు సభ్యులు నగర పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు