ధరలు తగ్గించం.. వస్తువుల పరిమాణం పెంచుతాం

– జీఎస్‌టీ తగ్గింపుపై పలు కంపెనీల నిర్ణయం
న్యూఢిల్లీ, నవంబర్‌30(జ‌నంసాక్షి) : వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల రోజువారీ వస్తువులపై జీఎస్‌టీ(వస్తు సేవల పన్ను) తగ్గించిన విషయం తెలిసిందే. 28శాతం శ్లాబులో ఉన్న 178 నిత్యావసర వస్తువులను కింది శ్లాబులకు మార్చింది జీఎస్‌టీ మండలి. అయితే ఈ తగ్గింపు వల్ల కలిగే జీఎస్‌టీ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయాలని ఆయా కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అనుగుణంగానే కొన్ని కంపెనీలు తమ వస్తువులపై ధరలను తగ్గిస్తున్నట్లు తెలిపాయి. కాగా.. మరికొన్ని కంపెనీలు మాత్రం ధరలను తగ్గించబోమంటున్నాయి. అయితే జీఎస్‌టీ ప్రయోజనాలను వినియోగదారులకు చేర్చేందుకు అదే ధరలకు ఎక్కువ వస్తువులు ఇస్తామని చెబుతున్నాయి. ధరల్లో ఎలాంటి మార్పులు చేయకుండా.. వస్తువుల పరిమాణం(సైజు) పెంచేందుకు కొన్ని కంపెనీలు సిద్ధమయ్యాయి. బోర్నవిటా, క్యాడ్బరీ, ఓరియో, హిందుస్థాన్‌ యునిలివర్‌ లాంటి సంస్థలు ఈ ఫార్ములాను పాటిస్తున్నట్లు చెప్పాయి. ‘మా వస్తువుల ధరల్లో ఎలాంటి మార్పులు చేయకుండా వాటి పరిమాణాన్ని పెంచుతున్నాం. 125 గ్రాముల రిన్‌ సబ్బు ధర రూ. 10 ఉంది. జీఎస్‌టీ తగ్గించిన తర్వాత అదే రూ. 10కి 140 గ్రాముల సబ్బును విక్రయిస్తామని హిందుస్థాన్‌ యూనిలివర్‌ చెబుతోంది. దీని వల్ల కస్టమర్లు మార్పును సులభంగా గుర్తించే అవకాశముంటుందని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.