నకిలీ విత్తన విక్రేతలపై కఠిన చర్యలుండాలి 

గుంటూరు,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించి మోసాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా కౌతురైతుల సంఘం నేతలు మరోమారు డిమాండ్‌ చేశారు. ముందు రైతుల్లో భరోసా కల్పించాలని అన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లంచేలా చూడాలని అన్నారు.  రైతులకు అన్నిరకాల విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచడంతో పాటు వేరుశనగ విత్తనాలు రాయితీపై అందజేయాలన్నారు. లాభార్జనే ధ్యేయంగా అమాయక రైతులకు నకిలీ విత్తనాలు కట్టబెట్టిన వారికి ఏ శిక్ష
విధించినా తక్కువేనని దుయ్యబట్టారు. నకిలీ విత్తనాల పరిశ్రమల నుంచి వచ్చే కమిషన్ల కోసం కొందరు ఆ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు.  రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతన్నా పెద్దగా స్పందించక పోవడం శోచనీయమన్నారు. రైతులకు రావాల్సిన ఇన్‌పుట్‌ రాయితీను వెంటనే చెల్లించాలని కోరారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన మిరప రైతులకు ఎకరాకు లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇప్పించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అప్పుల వూబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. రైతాంగం అనేక ఇబ్బందులు పడుతుంటే వాటి పరిష్కారం కోసం కృషి చేయకపోవడం  విడ్డూరంగా ఉందని  విమర్శించారు.