నటుడు శివాజీపై పోలీసులకు వైకాపా ఫిర్యాదు
విజయవాడ,అక్టోబర్29(జనంసాక్షి): ఏపీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంపై ఆపరేషన్ గరుడ జరుగుతోందంటూ హీరో శివాజీ చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగా తమ అధినేత జగన్ పై దాడి జరుగుతుందని శివాజీకి ముందే ఎలా తెలుసని తన ఫిర్యాదులో ప్రశ్నించారు. జగన్ పై జరిగిన దాడిలో శివాజీ హస్తం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. శివాజీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయనను కూడా విచారించాలని కోరారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ కు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ లు ఫిర్యాదు చేశారు.