నర్తించేవాడికి ఓటేయ్యొద్దు 

– ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ, మే4(జ‌నంసాక్షి) : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ బీజేపీ నేత మనోజ్‌ తివారీపై విరుచుకుపడ్డారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. నటుడైన మనోజ్‌ తివారీకి డ్యాన్స్‌ వేయడం మాత్రమే వచ్చనీ, పనులు చేయడం రాదని ఎద్దేవా చేశారు. తమ పార్టీ అభ్యర్థి దిలీప్‌ పాండేకు పనిచేయడం మాత్రమే వచ్చనీ, కాబట్టి ఆయనకు ఓటేసి గెలిపించాలని ఈశాన్య ఢిల్లీ లోక్‌ సభ నియోజకవర్గం ప్రజలను కోరారు. శనివారం ఈశాన్య ఢిల్లీలో కేజీవ్రాల్‌ ఆప్‌ అభ్యర్థి పాండే తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..మనోజ్‌ తివారీ డ్యాన్స్‌లో బాగా ఎగురుతాడని, అందులో ఆయనకు మంచి నైపుణ్యం ఉందన్నారు. కానీ పాండేజీకి నర్తించడం రాదని,  ప్రజల కోసం పనిచేయడం మాత్రమే ఆయనకు తెలుసన్నారు. కాబట్టి ఈసారి పనిచేసేవాడికే విూ ఓటు వేయండని కేజ్రీవాల్‌ సూచించారు. నర్తించేవాడికి ఓటును వేయవద్దని ఢిల్లీవాసులను కోరారు. ఇటీవల బీజేపీ రాంపూర్‌ అభ్యర్థి జయప్రదను నచ్‌ నేవాలీ(సినిమా పాటలకు గెంతులేసే మహిళ) అంటూ ఎస్పీ నేత ఆజాంఖాన్‌ వ్యాఖ్యానించి ఇబ్బందుల్లో పడ్డారు. ఈ నేపథ్యంలో కేజీవ్రాల్‌ వ్యాఖ్యలపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అన్నివర్గాల్లో ఆసక్తి నెలకొంది.