నల్లధనం వివరాలను వెల్లడించలేం

న్యూఢిల్లీ, నవంబర్‌26(జ‌నంసాక్షి) : విదేశాల నుంచి రప్పించిన నల్లధనం వివరాలను వెల్లడించలేమని ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొన్నది. సమాచార హక్కు చట్టంలోని కొన్ని నిబంధనల ప్రకారం ఆ వివరాలను వెల్లడించలేమని పీఎంవో తెలిపింది. నల్లధనంపై సమాచారం ఇవ్వడం వల్ల ఆ కేసుల దర్యాప్తు నీరుగారుతుందని, దాంతో నల్ల కుబేరులు తప్పించుకునే ప్రమాదం ఉందని పీఎంవో అభిప్రాయపడింది. అక్టోబర్‌ 16వ తేదీన సీఐసీ ఇచ్చిన ఆదేశాలకు స్పందిస్తూ పీఎంవో ఈ వ్యాఖ్యలను చేసింది. విదేశీ నల్ల కుబేరుల విషయంలో ప్రత్యేక విచారణ బృందం తమ పనిలో నిమగ్నమైందని పీఎంవో పేర్కొన్నది. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్‌ 8(1) ప్రకారం ఆ సమాచారాన్ని వెల్లడించలేమని పీఎంవో తెలిపింది. సంజీవ్‌ చతుర్వేది వేసిన అభ్యర్థనకు బదులిస్తూ పీఎంవో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆర్టీఐ చట్టం పరిధిలో లేని కొన్ని సంస్థలు నల్ల ధనం అంశంలో విచారణ చేపడుతున్నాయని, అలాంటి సంస్థలు ఇచ్చిన సమాచారాన్ని మధ్యలోనే బయటపెట్టలేమని పీఎంవో పేర్కొన్నది.