నవరాత్రి ఉత్సవాలలో .. భక్తులకు అసౌకర్యం కలగనివ్వం
– అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచాం
– ఆదివారం సీఎం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుంటారు
– శనివారం మధ్యాహ్నానికి 40వేల మంది దర్శనం చేసుకున్నారు
– విలేకరుల సమావేశంలో కలెక్టర్, ఈఓ
విజయవాడ, అక్టోబర్13(జనంసాక్షి) : నవరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని విజయవాడ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, దుర్గగుడి ఈఓ వి. కొటేశ్వరమ్మలు అన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చామని వారు స్పష్టం చేశారు. విజయవాడ దుర్గగుడిలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం వారు విూడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మూల నక్షత్రం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని ఆదివారం మధ్యాహ్నం దర్శించుకుంటారని తెలిపారు. మూలనక్షత్రం రోజు పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అప్రాన్ వద్ద శనివారం సాయంత్రం నుంచి ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించామని తెలిపారు. క్యూ లైన్ వద్ద ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఎక్కువ మంది వలంటీర్లను నియమించడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. మోడల్ గెస్ట్ హౌస్ ప్రాగణంలో చిన్నారులకు పాలు ఇచ్చేందుకు అమ్మఒడి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీస్, భవానీలు, సేవాదళాలు, వలంటీర్ల 2000 మంది ద్వారా వికలాంగులకు , పిల్లలకు, వృద్ధులకు దర్శనం కలుగచెయ్యడం జరుగుతుందన్నారు. ఈ నెల 15సోమవారం సాయంత్రం అప్రాన్ వద్ద రెండు గంటల పాటు పోలీస్ బ్యాండ్ ప్రదర్శన ఉంటుందన్నారు. శానిటేషన్ పై మునిసిపల్ సిబ్బంది తో ప్రత్యేకబృందాలను ఏర్పాటు చేయటం జరిగిందని కలెక్టర్ లక్ష్మీకాంతం తెలియజేశారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ.. మూల నక్షత్రం రోజున క్యూలైన్ అత్యంత వేగంగా కదిలేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూల నక్షత్రం రోజైన ఆదివారం 300, 100 టికెట్ల విషయమై ఒక ప్రకటన చెయ్యడం జరుగుతుందన్నారు. శనివారం మ.12.00 గంటల వరకు సుమారు 40 వేలమంది భక్తులు దర్శనం చేసుకున్నారన్నారు. మూల నక్షత్రం రోజున ఆదివారం ఉ. 1 గంట నుంచే అమ్మ వారి దర్శనం కోసం ఏర్పాట్లు చేస్తున్నామని ఈఓ తెలిపారు.