నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,నవంబర్‌21(జ‌నంసాక్షి): వరుసగా రెండో రోజు దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ బలహీన సంకేతాలతో పాటు విదేశీ నిధులు వెనక్కిమళ్లడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఐటీ, లోహ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలతో సూచీలు కుదేలయ్యాయి. ఫలితంగా బుధవారం నాటి సెషన్‌లో సెన్సెక్స్‌ 170 పాయింట్లకు పైగా కోల్పోగా.. నిఫ్టీ కూడా పతనమైంది. ఉదయం సూచీలు బలహీనంగా ప్రారంభమయ్యాయి. అమ్మకాల ఒత్తిడితో ఆరంభ ట్రేడింగ్‌లోనే సెన్సెక్స్‌ 200 పాయింట్లు

నష్టపోయింది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేని సూచీ చివరకు 275 పాయింట్లు దిగజారి 35,200 వద్ద ముగిసింది. అటు జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 56 పాయింట్ల నష్టంతో 10,600 వద్ద స్థిరపడింది. మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా ఫారెక్స్‌ మార్కెట్‌ నేడు పనిచేయలేదు. ఇక అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో విమానయాన, చమురు కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో రెడ్డీస్‌ ల్యాబ్స్‌, గ్రాసిమ్‌, యస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ్గ/నాన్షియల్‌ సర్వీసెస్‌, యూపీఎల్‌ లిమిటెడ్‌ షేర్లు లాభపడగా.. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహింద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు నష్టపోయాయి.