నాపై ‘కత్తి’ దూస్తావా ! వివేక్‌పై బొత్స ఫైర్
న్యూఢిల్లీ, ఆగస్టు 21 (జనంసాక్షి): దళిత నేత కత్తి పద్మారావుతో నన్ను తిట్టిస్తారా అంటూ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పెద్దపల్లి ఎంపి జి.వివేక్‌పై మంగళవారం మండిపడ్డారు. మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు రాజీనామా వ్యవహరంపై ఢిల్లీ పెద్దలతో చర్చించేందుకు బొత్స సత్తిబాబు ఢిల్లీ వెళ్లారు. తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తెలంగాణపై అధిష్ఠానాన్ని ఒప్పించే దిశలో ప్రయత్నాలు చేయాలని కోరుతూ బొత్సను కలిశారు. ఈ సందర్భంగా బొత్స వివేక్‌పైన మండిపడ్డారు. కత్తి పద్మారావుతో ప్రెస్ మీట్ పెట్టించి నన్ను తిట్టిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ నేతలను తిట్టిన పద్మారావకు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అపాయింట్‌మెంట్ కోరతారా అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట దళితుల హత్యాకాండపై ఆదివారం ఎంపి వివేక్ నివాసంలో కత్తి పద్మారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అతను బొత్సపై మండిపడ్డారు. లక్ష్మీపేట ఘటనలో బొత్స పాత్ర ఉందంటూ తీవ్రంగా ఆరోపించారు. దీంతో వివేక్ పద్మారావుపై అసహనం వ్యక్తంచేశారు. నా ఇంట్లో ప్రెస్ మీట్‌పెట్టి సొంత పార్టీ నేతపై మండిపడటమేమిటని కత్తిని ప్రశ్నించారు. ఇంట్లో ప్రెస్ మీట్‌ను పెట్టవద్దని కావాలంటే వేరే చోట పెట్టుకోవాలని సూచించారు. వివేక్ ఇంటి నుండి కత్తి పద్మారావు తనపై విరుచుకుపడటంతో బొత్స ఎంపీపై మండిపడ్డారు. అయితే కత్తి ప్రెస్‌మీట్‌తో తనకు సంబంధం లేదని, పార్టీ నేతను తిడతాడని తాను అనుకోలేదని పార్టీ నేతపై ఆరోపణలు చేస్తున్నారని తెలిసి తాను అతనిని వెంటనే వెళ్లిపోవాలని సూచించానని, తనపై బొత్స కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తారని భావించలేదని అన్నారు. కాగా, తెలంగాణ కోసం బొత్సను కలిసిన వారిలో వివేక్, రాజయ్య, పొన్నం ప్రభాకర్ తదితరులు కలిశారు.