నాలుగేళ్లలో అభివృద్ధిని వివరించేందుకు
‘ప్రగతి నివేదిన’ సభ
– బస్సుయాత్రతో దద్దమ్మ కాంగ్రెస్ నేతలు కారుకూతలు కూస్తున్నారు
– సూట్‌కేసు దొంగలు కూడా మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పాలి
– మళ్లీ టీఆర్‌ఎస్‌దే అధికారం
– రాహుల్‌గాంధీ వ్యవహారశైలితో ఓ బచ్చాఅని రుజువైంది
– విలేకరుల సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్
వరంగల్ అర్బన్, ఆగస్టు28(జనం సాక్షి) : గత నాలుగేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలు వివరించేందుకే ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్నామని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వరంగల్ అర్బన్‌లో పర్యటించిన మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. దద్దమ్మ కాంగ్రెస్ నేతలు బస్సు యాత్ర పేరుతో కారుకూతలు కూస్తున్నారని తలసాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌లో ప్రతి ఒక్కరూ సీఎం అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సూట్‌కేసు దొంగలు కూడా మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ తన మాటలతో ఓ బచ్చా అని అర్ధమైందని అన్నారు. హైదరాబాద్ పర్యటనలో, పార్లమెంటులో తన మాటలు, చేష్టలు దేశం మొత్తం చూసిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో బీజేపీ ఐదు స్థానాలు గెలిస్తే ఎక్కువని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 2న జరిగే సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవ్వాలని కోరారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, అవి అందరికీ అందుతున్నాయని, ఆ కృతజ్ఞతతో సభకు హాజరవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఓ ముఠాగా మారి లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలే మా ప్రధాన బలమని చెప్పారు. గతంలో ప్రభుత్వాలు కుల వృత్తులను నిర్వీర్యం చేస్తే మేము కుల వృత్తుల పునరుద్ధరణ కోసం అన్ని కులాలకు ఆర్ధిక చేయూతను ఇస్తున్నామని తెలిపారు.
రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాం. మిషన్‌కాకతీయతో చెరువులను పునరుద్ధరించామని, పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ ద్వారా రూ. లక్షా 116 రూపాయలు ఆర్థిక
సాయం అందిస్తున్నామన్నారు. కులవృత్తులకు సీఎం కేసీఆర్ పునరుజ్జీవం పోశారని, గొల్ల, కురుములకు సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేశామని, రైతుబంధు పథకంతో రైతులకు ఎకరానికి రూ. 4వేల చొప్పున రెండు పంటలకు రూ. 8వేలు ఇస్తున్నామని తెలిపారు. రైతుబీమా పథకం ద్వారా రైతు మరణిస్తే రూ. 5లక్షలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వాలు ప్రాజెక్టును పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నామన్నారు. గురుకుల హాస్టల్‌లో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిందేవిూ లేదని, కాంగ్రెస్ ఎన్ని బస్సు యాత్రలు చేసినా ప్రజలు నమ్మరు. మళ్లీ టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తదని పేర్కొన్నారు.