నావ్యాఖ్యలు కేవలం రాజకీయమైనవే!

– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌

శ్రీనగర్‌, నవంబర్‌23(జ‌నంసాక్షి) : జమ్ము కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు పీడీపీ- నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చేతులు కలపడం వెనుక పాకిస్థాన్‌ ప్రమేయం ఉందంటూ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతాపార్టీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ వెనక్కి తీసుకున్నారు. జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీని గవర్నర్‌ సత్యపాల్‌మాలిక్‌ బుధవారం అనూహ్యంగా రద్దు చేశారు. అంతకుముందు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు పీడీపీ

ముందుకు రావడంతో స్పందించిన రాంమాధవ్‌.. పీడీపీ-నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కలయిక వెనుక పాక్‌ హస్తం ఉందంటూ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఒమర్‌ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై చేసిన ఆరోపణలను నిరూపించాలని లేదంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. తమ చేతిలో ఉన్న దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించి ఆధారాలను ప్రజల ముందు ఉంచాలని సవాలు విసిరారు. ఒమర్‌ డిమాండ్‌తో దిగివచ్చిన రాంమాధవ్‌ తన ఆరోపణలు కేవలం రాజకీయమే తప్ప.. వ్యక్తిగతం కాదని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రభుత్వం ఏర్పాటులో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ విఫలమయ్యాయన్న రాంమాధవ్‌.. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. రాంమాధవ్‌ వ్యాఖ్యలను పీడీపీ అధినేత్రి మోహబూబా ముఫ్తి సైతం తప్పుపట్టారు.