నిధులున్నా ఖర్చు చేయలేని దుస్థితి

ఏలూరు,పిబ్రవరి20(జ‌నంసాక్షి): పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి పట్టణంలో అభివృద్ధి పనులకు కోట్లు విడుదల చేశారు. బీపీఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌, జనరల్‌, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక, అమృత్‌, ఆర్థికసంఘాల నిధులు ఇలా ఎన్నో ఇచ్చారు. వాటితో ప్రగతిని పరుగులు పెట్టించాల్సిన జిల్లా యంత్రాంగం గడువు ముంచు కొస్తున్నా అధికారయంత్రాంగం కదలడం లేదన్న విమర్శలు ఉన్నాయి.  ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. పట్టణాలకు అమృత్‌ పథకం అక్షయ పాత్ర అయింది. ఎస్సీ ఉపప్రణాళిక నిధుల కోసం పురపాలక సంఘాలు ప్రతిపాదనలు ఇచ్చారు. ఈ నిధులు ఎస్సీలు ఉన్న ప్రాంతాల్లోనే ఖర్చు చేయాలి. గడువులోగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండటంతో నిధులు మళ్లించే ప్రమాదముంది. ఎస్సీ, ఎస్పీ ఉప ప్రణాళిక నిధులు ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఆయా ప్రాంతాల్లో ఎస్సీ నివాసిత ప్రాంతాలకు అధికంగా వినియోగించాలి. రహదారులు, డ్రెయిన్లు, మరుగు కాలువలు, సామాజిక భవనాలు వంటి వాటిని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది.