నిబంధనల ప్రకారమే రాఫెల్‌ డీల్‌


– సుప్రీంకు తన వివరణ అందించిన కేంద్రం
న్యూఢిల్లీ, నవంబర్‌12(జ‌నంసాక్షి) : నిబంధనల ప్రకారమే రాఫెల్‌ డీల్‌ జరిగిందని కేంద్ర ప్రభుత్వం సుప్రింకోర్టుకు వివరించింది. రాఫెల్‌ యుద్ధ విమానాల కోనుగోలు అంశంపై సోమవారం సుప్రీంకోర్టుకు సీల్డు కవర్‌లో కేంద్ర ప్రభుత్వ తన వివరణను అందజేసింది. పక్కా నియమావళి ప్రకారమే రాఫెల్‌ యుద్ధ విమనాలను కొనుగోలు చేశామని కేంద్రం తన అఫిడవిట్‌లో సుప్రీంతో పేర్కొన్నది. 2013 డిఫెన్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానం ప్రకారమే యుద్ధ విమానాల కోనుగోలు జరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. ఫ్రాన్స్‌ నుంచి భారత్‌ 36 రాఫెల్‌ యుద్ధ విమానాలను కోనుగోలు చేస్తున్నదని, అయితే ఈ అంశంలో ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వ తీరును తప్పుపట్టాయి. ప్రధాని భారీస్థాయి అవినీతికి పాల్పడినట్లు కాంగ్రెస్‌ ఆరోపించింది. అక్రమ పద్ధతిలో రిలయన్స్‌ డిఫెన్స్‌ సంస్థకు రాఫెల్‌ డీల్‌ను అప్పగించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాఫెల్‌ డీల్‌కు సంబంధించిన వివరాలను సీల్డు కవర్‌లో సమర్పించాలని ఇటీవల సుప్రీం ఆదేశించింది. రాఫెల్‌ ధరలను వెల్లడించాలని సుప్రీం తన అక్టోబర్‌ తీర్పులో ఆదేశాలను జారీ చేసింది. అయితే టెక్నికల్‌ డిటేల్స్‌ అవసరం లేదని కూడా కోర్టు స్పష్టంగా చెప్పింది. చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులు ధర్మాసనం రాఫెల్‌ అంశాన్ని పరిశీలిస్తున్నది. యూయూ లలిత్‌, కేఎం జోసెఫ్‌లు ఈ టీమ్‌లో ఉన్నారు. మనోహర్‌ లాల్‌ శర్మ, వినీత్‌ ధండాలు వేసిన వ్యాజ్యాలను కోర్టు
విచారిస్తున్నది.