నిరుద్యోగాన్ని  పట్టించుకోని మోడీ సర్కార్‌

తిరోగమన విధానాలతో పరిశ్రమల మూత
కార్పోరేట్లకు దోచిపెట్టడంతో బ్యాంకులపై భారం
న్యూఢల్లీి,డిసెంబర్‌20 (జనంసాక్షి): అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని
మభ్య పెట్టిన మోడీ ఆ ఊసే ఎత్తడం లేదు. పదేళ్లు కావస్తోంది. మరోమారు తమదే అధికారం అని
ఢంకా బజాయిస్తున్నారు. స్వయం ఉపాధి పేరుతో నిరుద్యోగులను మభ్యపెడుతున్నారు. గత పదేళ్లలో..  కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా కార్మిక వ్యతిరేక విధానాలతో వేలాది పరిశ్రమలు మూతపడడానికి కారణం అయ్యారు.బిజెపి ప్రభుత్వ అనాలోచిత, ఏకపక్ష విధానాలు రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్నాయి. పెరుగుతున్న అధిక భారాలు, పన్నులు, నిరుద్యోగం, నూతన విద్యావిధానం, ప్రభుత్వ రంగసంస్థల ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, రాజ్యాంగ వ్యవస్థల్లో అనుచిత జోక్యం, రక్షణ రంగంలో ఉద్యోగాల కోతకు వ్యతిరేకంగా దేశ ప్రజలు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కారణంగా కనీసం 6 కోట్ల మందికి ఉపాధి పోయిందని అంచనా. అన్ని సంస్థలను ప్రైవేటుకు అప్పగించే పనిలో మాత్రం వేగం పెంచారు. రైల్వేరంగాన్ని కార్పోరేట్‌ సంస్థలకు అప్పనంగా అప్పజెప్పుతున్నారు. విశాఖ ఉక్కును నష్టాల పేరుతో విదేశీ కంపెనీలకు అమ్మివేసే ప్రయత్నం చేస్తున్నారు. పండిరచిన పంటకు గిట్టుబాటు ధరలేక, దిగుబడిలేక ఎంతో మంది రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కరోనా వైరస్‌ కష్టకాలంలో ఉపాధి లేక వేలాదిమంది ఆకలితో అలమటించారు. ఆసుపత్రులకు డబ్బులు కట్టలేక ఆస్తులు అమ్ముకున్నారు. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అలాంటి వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆనాటి పరిస్థితులను చూసి చలించిన ఎందరో వారిని దగ్గరికి తీసి, వారి ఆకలిని తీర్చి వారిని వారి గమ్యస్థలాలకు చేర్చే ప్రయత్నం చేశాయి. కానీ ప్రభుత్వం మాత్రం వారిని గాలికొదిలేసింది. మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా బిజెపి విధానాలను వ్యతిరేకించకుండా అనుకూల రాజకీయాలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశ విదేశీ కార్పొరేట్లకు వివిధ రకాల రాయితీలు, కానుకలు సమర్పిస్తూ వారిని మరింత సంపన్నవంతం చేయడం దారుణం. భారత రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారం గడచిన ఐదేళ్లలో షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకులు రూ.10,09,510 కోట్ల రుణాలను మాఫీ చేశాయని కేంద్రమంత్రి  తెలిపారు. అంటే సగటున ఏడాదికి రెండు లక్షల కోట్ల రూపాయల రుణాలు సంపన్నులకు రద్దయాయన్నది గుర్తించాలి. ఇందులో దాదాపు సగం సార్వత్రిక ఎన్నికల సమయంలో అంటే 2018`19, 2019`20 సంవత్సరాల్లోనే 4,70,435 కోట్లు రద్దు చేశారు. ఆ సమయంలోనే ఎన్నికల బాండ్లు భారీగా అమ్ముడు పోవడం గమనార్హం.కేవలం మాఫీ ప్రకటించడమే తప్ప రుణ వసూలు పక్రియ కొనసాగుతూనే ఉంటుందని నమ్మబలికారు. ఐదేళ్లలో ఇటువంటి మాఫీ చేసిన రుణాల్లో రూ.1,32,036 కోట్లు వసూలు చేసినట్లు గొప్పగా చెప్పుకొచ్చారు. అంటే మాఫీచేసిన మొత్తంలో కేవలం పదోవంతు మాత్రమే బ్యాంకులకు వసూలయిందన్న మాట.  కార్పొరేట్లు తీసుకున్న రూ.4.5 లక్షల కోట్ల బ్యాంకు రుణాల్లో కేవలం రూ. 1.61 లక్షల కోట్లు మాత్రమే వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరుతో వసూలు చేశారు. అంటే బ్యాంకులు రూ.2.85 లక్షల కోట్లు కోల్పోయాయి. ఇలా బ్యాంకుల సొమ్ము కార్పొరేట్ల పాలు అవుతోంది. మోడీ ప్రభుత్వం వచ్చాక పరోక్ష పన్నులను, సెస్సులను పెంచి జనంపై భారాలు పెంచి, ప్రత్యక్ష పన్నుల్లో కార్పొరేట్లకు వివిధ రూపాల్లో రాయితీలు కల్పిస్తోంది. బడ్జెట్లో దాదాపు 8శాతం కార్పొరేట్‌ పన్ను రాయితీల ద్వారా వారికి లక్షల కోట్ల రూపాయల లబ్ది చేకూర్చింది. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి వాటిని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. ప్రతి ఏటా డిజిన్వెస్ట్‌మెంట్‌ పేరుతో ప్రజల సొత్తు అప్పనంగా కుబేరులకు అప్పగిస్తు న్నారు. భారీ ప్రచారంతో తీసుకొచ్చిన మానిటైజేషన్‌ పైప్‌ లైన్‌ పథకం కూడా ఆ కార్పొరేట్లకే లబ్ది చేకూర్చింది. ఇలా అన్ని విధాలుగా సంపన్నులకు ప్రజల సంపదను దోచిపెడుతున్న సర్కారు సామాన్య రైతులు, సాధారణ ప్రజలపట్ల మాత్రం కర్కశంగా వ్యవహరిస్తోంది.  కరువు కాటకాల వలన, వరదలు, తుపాను వలన నష్టపోయి లేదా పంటకు న్యాయమైన ధర దక్కక తీవ్రంగా
నష్టపోయిన కారణంగా బ్యాంకులో తీసుకున్న రుణం తిరిగి తీర్చలేని రైతుల నుండి మాత్రం ఎటువంటి మినహాయింపు లేకుండా వసూలు చేయాలని బ్యాంకులను సర్కారు ఆదేశిస్తుంది. మధ్యతరగతి ప్రజానీకం తమ గృహ రుణాలు లేదా వినిమయ రుణాలను తీసుకొని కోవిడ్‌ సమయంలో తిరిగి కిస్తీలు కట్టలేని పరిస్థితిలో వాటిని మాఫీ చేయాలని గగ్గోలు పెట్టినా బ్యాంకుల ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుందనీ, అలా చేయడం సాధ్యం కాదనీ మోడీ సర్కారు సుప్రీం కోర్టులో చెప్పింది. మరి ఈ పదేళ్లలోనే పది లక్షల కోట్ల రూపాయలకు పైగా కార్పొరేట్లకు మాఫీ చేస్తే ఆర్థిక క్రమశిక్షణ ఏమయినట్లో మోడీ సర్కారే చెప్పాలి.
““““