నిరుద్యోగుల ఆగ్రహానికి..కేసీఆర్ బలికాక తప్పదు
– ప్రజలను ఓట్లు అడిగే హక్కు తెరాసకు లేదు
– కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్19(జనంసాక్షి) : తెలంగాణలో నిరుద్యోగుల ఆగ్రహానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ సర్కార్ బలికాక తప్పదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్లు అవకాశం ఉన్నా నాలుగు
ఏళ్లకే కేసీఆర్ కాడి ఎత్తేశారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం నీళ్లు వినియోగంలోకి తేకుండా ఓటు అడిగే హక్కు టీఆర్‌ఎస్‌కు లేదన్నారు. ఎల్లంపల్లి నుండి వేల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లిందని, అయినా కేసీఆర్ ప్రభుత్వం ఏవిూ చేయలేకపోయిందని జీవన్‌రెడ్డి విమర్శించారు. ఊరుకో వాటర్ ప్లాంట్ పెడితే వెయ్యి కోట్లతో అయ్యేదని, కానీ, మిషన్ భగీరథ పేరుతో రూ. వేల కోట్లు వృథా చేశారని మండిపడ్డారు. మైనార్టీలకు ఇస్తామన్న 12శాతం రేజర్వేషన్ ఏమైందని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రధాని మోడీ కూడా అనుకూలంగా ఉన్నారు అని చెప్పిన కేసీఆర్ ఎందుకు రేజర్వేషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఆగ్రహానికి కేసీఆర్ బలికాక తప్పదని హెచ్చరించారు. పరీక్షల పేరుతో కట్టే ఫీజులను కూడా ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తోందన్నారు. ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, కాంగ్రెస్‌కు పట్టం గట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.