నిరుపేదలకు ఆపద్భాంధు.. సీఏం సహాయ నిధి

నియోజకవర్గంలోని 242 మంది లబ్ధిదారులకు సీఏంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
– చెక్కులను తమ బ్యాంకుఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులను కోరిన మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట బ్యూరో నవంబర్ 30( జనం సాక్షి )అత్యవసరమైతేనే.. ప్రయివేటు ఆసుపత్రికి పోవాలని, సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నీ రకాల వైద్యులు, సేవలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.ఆసుపత్రి వైద్యం కై వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టలేని నిరుపేద కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉడుతా భక్తి కింద ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం అందిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు చెప్పారు.జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం నియోజకవర్గ పరిధిలోని 242 మంది లబ్ధిదారులకు రూ.77 లక్షల 93 వేల 500 రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నీ రకాల సౌకర్యాలు, మిషన్లు, పరికరాలు అన్నీ ఏర్పాట్లు చేశామని, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఈ యేడాదిలో సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో క్యాత్ ల్యాబ్ వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఈ చెక్కులను వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. చెక్కులు పొందేందుకు వచ్చిన ప్రతీ లబ్ధిదారు కడుపునిండా అన్నం తిని వెళ్లాలని మంత్రి కోరారు.ఈ మేరకు వీరిలో పట్టణంలోని 92 మందికి రూ.26 లక్షల 93 వేలు, సిద్ధిపేట రూరల్ మండలంలోని 30 మందికి రూ.8 లక్షల 80 వేలు, సిద్ధిపేట అర్బన్ మండలంలోని 20 మందికి రూ.7 లక్షల 6550 వేలు, చిన్నకోడూర్ మండలంలోని 41 మందికి రూ.17 లక్షల 38 వేల 500, నంగునూరు మండలంలోని 35 మందికి రూ.11 లక్షల 25 వేలు, నారాయణరావుపేట మండలంలోని 24 మందికి రూ.6 లక్షల 50 వేల 500 రూపాయల చొప్పున మొత్తం రూ.26 లక్షల 93 వేల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు.