నెరవేరిన సంచార జాతుల సొంతింటి కల

యానాది,ఎరుకుల కులస్థులకు గృహాలు

స్వచ్ఛంద సంస్థ సహకారంతో పూర్తి చేసిన ప్రభుత్వం

గుంటూరు,జనవరి25(జ‌నంసాక్షి): పేదరికంలో మగ్గుతున్న అణగారిన, అట్టడుగు వర్గాల వారికి శాశ్వత గృహ వసతి సమకూర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి, ఒక స్వచ్ఛంద సంస్థ సహకారం తోడవడంతో సంచార జాతులైన ఎస్‌.టి. కుటుంబాలకు పక్కా ఇళ్లు సమకూరాయి. అందరికీ గృహవసతి కల్పించాలన్న ప్రభుత్వ ఆశయం నెరవేరింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకం కింద అందజేస్తున్న ఆర్ధిక సహాయం గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గంలో నివసిస్తున్న 54 కుటుంబాల సొంత ఇంటి కలలు నెరవేర్చింది.రేపల్లె నియోజకవర్గంలోని పోటుమెరక గ్రామంలో యానాది, ఎరుకల తదితర ఎస్‌.టి. వర్గాలకు చెందిన కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నాయి. పంట పొలాల్లో ఎలుకలను పట్టడమే వృత్తిగా జీవించే ఈ కుటుంబాల వారికి వచ్చే రోజువారీ ఆదాయం వారి కుటుంబాల పోషణకు కూడా సరిపోని పరిస్థితి వుంది. అటువంటి పరిస్థితిలో సొంత ఇళ్లు కలిగి వుండటం అనేది వారికి నెరవేరని స్వప్నంగానే మిగిలిపోతోంది. రాష్ట్రంలో 2022 నాటికి ప్రతి ఒక్కరికీ గృహవసతి కల్పించాలన్నరాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం వారికి కలసి వచ్చింది. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో క్రియాశీలకంగా పనిచేసే రేపల్లె శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్‌ వీరి గృహనిర్మాణంపై దృష్టిసారించారు. ప్రభుత్వం ఎన్టీఆర్‌ గ్రావిూణ గృహనిర్మాణ

పథకంలో రూ.2.25 లక్షల వరకు షెడ్యూల్డు తెగల వారు ఇళ్లు నిర్మించుకొనేందుకు మంజూరు చేస్తోంది.

దీనికి అదనంగా మరికొంత మొత్తాన్ని జోడిస్తే వారికి శాశ్వత గృహవసతి సమకూర్చవచ్చని భావించి విలేజ్‌ రికన్‌స్టక్షన్ర్‌ ఆర్గనైజేషన్‌ అనే సంస్థ సహకారాన్ని తీసుకున్నారు. ఈ సంస్థ అదనంగా ఒక్కో ఇంటికోసం రూ.1.25 లక్షల వరకు అదనంగా ఖర్చుచేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఏడు నెలల క్రితం యానాదులు, ఎరుకల కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపు రూ.3.50 లక్షల వరకు వెచ్చించి మొత్తం 54 ఇళ్లతో ఒక కాలనీని పోటుమెరక గ్రామంలో నిర్మించారు. మూడు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఇంటిలో వంటగది, పడకగది, నివసించే గది, మరుగుదొడ్డి వంటి తదితర సౌకర్యాలతోపాటు ఇంటి పైకప్పును వినియోగించుకొనేందుకు వీలుగా ప్రతి ఇంటికి మెట్లు కూడా నిర్మించారు. ఇళ్ల కిటికీలకు దోమలు చొరబడకుండా తెరలు కూడా ఏర్పాటు చేశారు. ఇళ్లన్నీ ఒకే నమూనాతో నిర్మించడంతోపాటు ఆయా ఇళ్ల మధ్య తగినంత ఖాళీస్థలాన్ని విడిచిపెట్టడం ద్వారా విశాలవంతంగా ఇళ్లను నిర్మించారు. కాలనీలో అంతర్గత రహదారులుగా సిమెంటు రోడ్లను నిర్మించారు. /ూష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖల మంత్రి కాలవ శ్రీనివాసులు ఈ కాలనీని ప్రారంభించి లబ్దిదారులతో గృహప్రవేశాలు చేయించారు. పండగ వాతావరణంలో అన్ని ఇళ్లకు తోరణాలతో అలంకరించి ఉత్సాహంగా లబ్దిదారులు గృహప్రవేశాలు చేశారు. కాలనీ నిర్మాణంలో చొరవ చూపిన ఎం.ఎల్‌.ఏ. సత్యప్రసాద్‌, వి.ఆర్‌.ఓ. సంస్థ ప్రతినిధులను అభినందించారు. తాను జీవితంలో పాల్గొన్న అన్నికార్యక్రమాల కంటే ఈ కార్యక్రమం అత్యంత సంతృప్తినిచ్చిందని మంత్రి కాలవ పేర్కొన్నారు. ఈ కాలనీకి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని మంత్రి యీ సందర్భంగా హావిూ ఇచ్చారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎం.డి. కాంతిలాల్‌ దండే, వి.ఆర్‌.ఓ. సంస్థ ప్రతినిధులు ధన్‌పాల్‌, అమల్‌రాజ్‌, మార్తా, మాజీ ఎం.ఎల్‌.ఏ. ఎం.వెంకటసుబ్బయ్య తదితరులంతా పాల్గొన్నారు.