నేటినుంచి అంతర్వేది ఉత్సవాలు

భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు
కాకినాడ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ వివివి.సత్యనారాయణ మూర్తి ప్రకటించారు. ఈ నెల 12వ తేది నుండి 20 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.  సోమవారం ఉదయం అంతర్వేది దేవస్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎసి మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలకు సుమారు 10 లక్షల మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నెల 15 న నిర్వహించనున్న కల్యాణానికి, 16న నిర్వహించనున్న రథోత్సవానికి, 19 న చక్రవారి స్నానానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తుల మనోభావాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించామని, ఇప్పటికే చలువ పందిళ్లు, భక్తుల దైవ దర్శనార్థం క్యూలైన్ల కోసం ప్రత్యేకంగా బారికేడ్ల నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అధికారులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు, ధార్మిక సంస్థల సేవకుల సేవలను సమన్వయంతో వినియోగించుకోవాలని సూచించారు. స్వామి వారి కళ్యాణ మహాత్సవాల సందర్భంగా.. కళ్యాణం, తీర్థం, రథోత్సవం, చక్రస్నానం నిర్వహించే రోజులలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతున్నామని ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ వివివి.సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు.