నేటినుంచి గునుపూడిలో శివరాత్రి ఉత్సవాలు

భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు

ఏలూరు,మార్చి1(జ‌నంసాక్షి): పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వరజనార్దనస్వామి ఆలయంలో ఈ నెల 2 నుంచి 6 వరకు శివరాత్రి మ¬త్సవాలకు ఏర్పాట్లు చేసినట్లు ఈవో ఎన్‌.సతీష్‌కుమార్‌ చెప్పారు.

2న శనివారం ఉదయం 5 గంటలకు స్వామివారికి రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, లక్ష కుంకుమార్చన చేపడతారు. సాయంత్రం శివలీలలు హరికథ, ధ్వజరోహణ, రాత్రి గాయత్రి సిస్టర్స్‌ తాడేపల్లిగూడెం వారి కూచిపూడి జానపద నృత్య ప్రదర్శన ఉంటుంది. 3న ఆదివారం ఉదయం రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, లక్ష కుంకుమార్చన, రాత్రి నంది, గరుడ వాహనాలపై స్వామివార్ల గ్రామోత్సవం నిర్వహిస్తారు. 4న సోమవారం మహాశివరాత్రి తెల్లవారుజామున 2.45 గంటల నుంచే స్వామికి అభిషేకాలు ప్రారంభం అవుతాయి. రాత్రి అఖండ దీపారాధన, స్వామివారికి రుద్రాభిషేకం, సినీ సంగీత విభావరి, స్వామివార్లకు మహానివేదన, అర్ధరాత్రి 2 గంటలకు గ్రామోత్సవం ఉంటుంది. ఇదే సందర్భంలో స్వామివార్లకు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు దంపతులు పట్టువస్త్రాల సమర్పణ, కల్యాణ మ¬త్సవం జరుగుతాయి. 5న మంగళవారం సాయంత్రం రథోత్సవం,కూచిపూడి నృత్య ప్రదర్శన,సినీ సంగీత విభావరి ఉంటుంది. 6న ఉదయం రథోత్సవం, పూర్ణాహుతి, త్రిశూల స్నానం, వసంతోత్సవం, రాత్రి స్వామివార్లకు చంద్ర పుష్కరిణిలో హంస వాహనంపై తెప్పోత్సవం, బాణసంచా కాల్పులు, గ్రామోత్సవం, స్వామివార్లకు పుష్పయాగం జరుగుతాయి. గతేడాది సుమారు 60 వేల మంది భక్తులు దర్శించుకున్నారని, ఈ ఏడాది 70 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు.