నేటినుంచి ఫుడ్‌ బాస్కెట్‌ పథకం

గిరిజనులకు పౌష్టికాహర పంపిణీ
అమరావతి,,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): గిరిజనుల్లో పౌష్టికాహార స్థాయిని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫుడ్‌ బాస్కెట్‌ పథకంలో సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ఈ పథకానికి ఫిబ్రవరి 13న సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ పథకం
అమలుపై బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠా అధ్యక్షతన రాష్ట్రస్థాయి కో ఆర్డినేషన్‌ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో సీఎస్‌ మాట్లాడుతూ ఈ పథకంలో 2లక్షల గిరిజన కుటుంబాలకు రూ.532 కోట్ల విలువైన నిత్యావసర సరుకులతో కూడిన ఫుడ్‌ బాస్కెట్‌ కిట్లను ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. కందిపప్పు, రాగి ప్లేవర్‌, బెల్లం, సన్‌ ప్లవర్‌ ఆయిల్‌, డీఎఫ్‌ఏ సాల్టు తదితర 6రకాల సరుకులు ఈ కిట్‌లో ఉంటాయన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ ట్రైబల్‌ రిఫార్మ్‌ యార్డిస్టిక్‌ (టీఆర్వై) కార్యక్రమం అమలులో భాగంగా గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, తాగునీరు, రహదారులు వంటి కనీస సౌకర్యాలను పూర్తిగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం పెద్దఎత్తున జరుగుతోందని చెప్పారు.