నేడు అనంతకుమార్‌ అంత్యక్రియలు

జాతీయ పతాకం అవనతం

కర్నాకటలో మూడురోజలు సంతాపదినాలు

బెంగళూరు,నవంబర్‌12(జ‌నంసాక్షి): కేంద్ర మంత్రి, భాజపా సీనియర్‌ నేత అనంత్‌ కుమార్‌ (59) అంత్యక్రియలు మంగళవారం అధికారిక లాంఛనాలతో జరుగనున్‌ఆనయి. ఆయన మృతికి కర్నాక ప్రభుత్వం మూడురోజుల సంతాపదినం ప్రకటించింది. దీంతో సోమవారం సెలవు ఇచ్చారు. అలాగే జాతీయ జెండాను అవనతం చేశారు.అనంత్‌కుమార్‌ అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి. ఆయన పార్థివదేహాన్ని బసవనగుడిలోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. ఉదయం 8 గంటలకు ఆయన భౌతికకాయాన్ని మల్లేశ్వరంలోని భాజపా అధికారిక కార్యాలయం జగన్నాథ్‌ భవన్‌కు తీసుకురానున్నారు. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు నివాళులర్పిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేషనల్‌ కాలేజీలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు చామరాజపేట్‌లోని స్మశానవాటికలో అనంత్‌కుమార్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు భాజపా కర్ణాటక జనరల్‌ సెక్రటరీ ఎన్‌ రవికుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం అర్థరాత్రి అనంతకుమార్‌ కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని శ్రీశంకర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజుల క్రితం ఆయన అమెరికాలో, యూకేలోనూ చికిత్స పొందారు. అయితే అక్కడ చికిత్స విజయవంతం కాకపోవడంతో గతనెలలో బెంగళూరుకు తిరిగి వచ్చారు. సోమవారం తెల్లవారు జామున 2 గంటలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మైసూర్‌ వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆయన సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1959 జూలై 22న బెంగళూరులో అనంత్‌కుమార్‌ జన్మించారు. ఆరెస్సెస్‌ నేతగా, ఏబీవీపీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన 1987లో భారతీయ జనతాపార్టీలో చేరారు. అప్పటి నుంచి ఎల్‌.కే అడ్వాణీకి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. దక్షిణ బెంగళూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి 1996లో తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి 2014లో జరిగిన చివరి ఎన్నికల వరకు ఆయన ఓటమనేది ఎరగకుండా విజయం సాధించారు. 2014ఎన్నికల్లో నందన్‌ నీలేకనిపై పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. ఆరు సార్లు వరుసగా ఎంపీగా గెలిచిన ఆయన కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి నూతనోత్తేజాన్ని తీసుకువచ్చారు. 2004 నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. 1998లో మధ్యంతర ఎన్నికలు జరిగినప్పడు వాజ్‌పేయి కాబినెట్‌లో అనంత కుమార్‌కు పౌరవిమానయాన శాఖ మంత్రి పదవి దక్కింది. అప్పటి కేంద్రమంత్రి వర్గంలో ఆయనే అతి చిన్న వయస్కుడు కావడం గమనార్హం. ఆయన మృతికి కర్నాటక నేతలు నివాళి అర్పించారు.