నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన

– పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
– గుంటూరులో జరిగే సభలో పాల్గొని ప్రసంగించనున్న మోదీ
– మోదీ పర్యటనకు పటిష్ఠ భద్రత
– జనసవిూకరణపై దృష్టిసారించిన బీజేపీ నేతలు
– నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్న తెదేపా, ప్రజా సంఘాల నేతలు
– అడ్డుకుంటామన్న వామపక్ష పార్టీలు
గుంటూరు, ఫిబ్రవరి9(జ‌నంసాక్షి) : ప్రధాని మోదీ నేడు ఏపీలో పర్యటించనున్నారు. తెలుగుదేశం పార్టీతో తెగదెంపులైన తరువాత మోదీ తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. ఆదివారం ఉదయం 11.15 గంటలకు గుంటూరు నగరానికి చేరుకోనున్న మోదీ.. ఏటుకూరు బైపాస్‌లో పలు ప్రాజెక్టులను ప్రారంభించి వాటి శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సవిూపంలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కాగా మోడీ జనవరిలో, ఫిబ్రవరి మొదటి వారంలో ఏపీకి వచ్చేందుకు షెడ్యూల్‌ ఖరారు కాగా.. మోదీ వస్తే ఆందోళనలు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్‌ నివేదికల మేరకు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
కాగాఎట్టకేలకు మోడీ నేడు గుంటూరుకు రానున్నారు.
మోదీ పర్యటనకు పటిష్ఠ భద్రత..
ప్రధాని నరేంద్ర మోడీ.. ఏపీ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఆదివారం మోదీ పర్యటన నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుంటూరు నగర శివారులోని ఎటుకూరు వద్ద జాతీయ రహదారి పక్కనే ‘సత్యమేవ జయతే’ పేరుతో ప్రజా చైతన్య సభను బీజేపీ నిర్వహించనుంది. సభా ప్రాంగణానికి వాజపేయి ప్రాంగణంగా నామకరణం చేశారు. ఉదయం 11.10 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. నరేంద్ర మోడీ. ప్రధాని పర్యటన నేపథ్యంలో 1,700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. లా అండ్‌ ఆర్డర్‌ డీజీ రవి శంకర్‌ అయ్యన్నార్‌ బందోబస్తు వ్యవహారాలను చూస్తున్నారు. గుంటూరు సభ వేదికగా విశాఖలో రూ.1,178.35 కోట్లతో ఏర్పాటుచేసిన 1.33 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన చమురు నిల్వ కేంద్రాన్ని, ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలో రూ. 5, 300 కోట్ల అంచనా వ్యయంతో కేజీ బేసిన్‌లో ఏర్పాటు చేసిన గ్యాస్‌ ఫీల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుని జాతికి ప్రధాని మోడీ అంకితం చేయనున్నారు. కృష్ణపట్నంలో 100ఎకరాలలో రూ.700 కోట్ల అంచనా వ్యయంతో పెట్రోలియం కార్పొరేషన్‌ ఏర్పాటు చేయనున్న చమురు సవిూకరణ, నిల్వ పంపిణీ టెర్మినల్‌కు కూడా ఇదే వేదికగా శంకుస్థాపన చేయనున్నారు. ఇక ప్రధాని సభను విజయవంతం చేసే పనిలో నిమగ్నమయ్యాయి ఏపీ బీజేపీ శ్రేణులు.. ఈ బహిరంగసభకు పెద్ద ఎత్తున జనసవిూకరణ చేయడంపై దృష్టిసారించారు.
జనసవిూకరణపై బీజేపీ నేతల్లో ఆందోళన..
మోదీ సభకు జన సవిూకరణ ఎలా చేయాలన్న దానిపై ఏపీ బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు చేదు అనుభవం ఎదురైన ఎదురైన సంగతి తెలిసిందే. పలాసలో మూడువేల మంది కోసం కుర్చీలు ఏర్పాటుచేయగా.. కనీసం మూడొందల మంది కూడా రాకపోవడంతో షా బస్సులో నుంచే ప్రసంగించి వెళ్లిపోయారు. అనంతరం ఆయన రాష్ట్ర నాయకులకు చివాట్లు పెట్టినట్లు తెలిసింది. దీంతో మోదీ సభకు భారీగా జనాన్ని సవిూకరించాలని నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ పక్క ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోదీ, కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటే రాష్ట్ర బీజేపీ నేతలు ధీటుగా ఎదుర్కోలేక పోతున్నారు. ఇప్పుడు మోదీ సభకు జనం రాకపోతే పార్టీ పరువు మొత్తం పోతుందని నేతలు భయపడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో గుంటూరు జిల్లాలోని కొందరు వైసీపీ నేతల సహకారంతో జనాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆదివారం భారీ సంఖ్యలో శుభకార్యాలు ఉండటం కూడా జన సవిూకరణకు అడ్డంకిగా మారింది. దీంతో మోదీ సభ ఎలా జరుగుతుందోనని బీజేపీ నేతలు ఆందోళణ చెందుతున్నారు.
ప్రధాని పర్యటనను అడ్డుకుంటాం – వామపక్షాలు
రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసి, ఏముఖం పెట్టుకుని రాష్ట్రంలో సభలు నిర్వహిస్తారని ప్రధాని నరేంద్రమోదీని వామపక్షాలు ప్రశ్నించాయి. ఆయన  పర్యటనను రాష్ట్రంలో అడ్డుకుంటామని ప్రకటించాయి.  గుంటూరులో ఆదివారం మోదీ సభ జరగనున్న నేపథ్యంలో శనివారం బెజవాడలో వామపక్షాలు ఖాళీ కుండలతో నిరసన తెలియజేసి అనంతరం వాటిని పగులగొట్టాయి. ‘మోదీ గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి సీపీఎం, సీపీఐ రాష్ట్ర నేతలు మధు, రామకృష్ణలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న అన్ని రాష్ట్రాల
పట్ల కేంద్రం వైఖరి ఒకేలా ఉందన్నారు. దీన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తమ నిరసను తెలియజేస్తామని, అరెస్టులకు కూడా భయపడమని స్పష్టం చేశారు.  ఆయా పార్టీలు, ప్రజా సంఘాలు కూడా తమ తమ స్థాయిల్లో మోదీ పర్యటనను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
బస్సులు ఇవ్వకుండా అధికారులతో వేధింపులు – కన్నా లక్ష్మీనారాయణ
ప్రధాని మోదీ గుంటూరు పర్యటనను అడ్డుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని బీజేపీ ఏపీ చీఫ్‌ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. మోదీ ‘ప్రజా చైతన్య సభ’కు బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులను తరలించడానికి బస్సులు ఇవ్వకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో శనివారం నిర్వహించిన విూడియా సమావేశంలో కన్నా మాట్లాడారు.
బీజేపీ సభకు బస్సులు ఇవ్వవద్దని యజమానులను ప్రభుత్వ పెద్దలు ఆర్డీవో అధికారులతో బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం దిగజారిన ముఖ్యమంత్రి ఏపీలో ఉన్నారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ గుంటూరులో ఆదివారం నిర్వహించనున్న ప్రజాచైతన్య సభను భగ్నం చేయాలని చంద్రబాబు టీడీపీ గూండాలకు పిలుపునిచ్చారని ఆరోపించారు.