నేడే ఇండియా- వెస్టండీస్‌.. రెండో వన్డే


– వైజాగ్‌ వేదికగా చారిత్రాత్మక మ్యాచ్‌
– 950వ మ్యాచ్‌ ఆడనున్న భారత్‌
విశాఖపట్టణం,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): భారత్‌ – వెస్టండీస్‌ టీంల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ నేడు విశాఖ పట్టణం వేదికగా జరగనుంది.. వెస్టిండీస్‌తో ఐదువన్డేల సిరీస్‌లో భాగంగా రెండోవన్డేకు విశాఖ సిద్ధమైంది.   ఇప్పటికే తొలి వన్డే గెలిచి ఉత్సాహంగా ఉన్న టీమిండియా అచ్చొచ్చిన వైజాగ్‌ వేదికగా మరో విజయాన్ని నమోదు చేయాలని భావిస్తోంది. ఇటీవల మ్యాచ్‌కు ఒకరోజు ముందే 12మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించే కొత్త సంప్రదాయానికి తెరలేపిన బీసీసీఐ వైజాగ్‌ వన్డే జట్టును కూడా ప్రకటించింది.
తొలి వన్డే జట్టునే ప్రకటించిన జట్టుమేనేజ్‌మెంట్‌ కొత్తగా కుల్దీప్‌ పేరును చేర్చింది. అయితే తుది జట్టులో కుల్దీప్‌ ఆడుతాడా లేక వేరే ఆటగాడు బెంచ్‌కు పరిమితం అవుతాడన్న విషయం మ్యాచ్‌ ముందు తెలియనుంది. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే మాత్రం కుల్దీప్‌ మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి
ఉంటుంది. ఒక వేళ కెప్టెన్‌ కోహ్లి ముగ్గురు స్పిన్నర్లకు మొగ్గు చూపితే ఉమేశ్‌ లేక యువ బౌలర్‌ కలీల్‌ బెంచ్‌కు పరిమితం అవుతారు. ఇక భారత్‌ బుధవారం 950వ వన్డే ఆడనుంది. ఈ మైలురాయిని అందుకోనున్న తొలి జట్టుగా రికార్డు సృష్టించనుంది.
రికార్డుకు ఒక్కసిక్స్‌ దూరంలో రోహిత్‌..
ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారీ శతకంతో చెలరేగిపోయిన రోహిత్‌ శర్మ మరో రికార్డును సమం చేసేందుకు అడుగుదూరంలో నిలిచాడు. గత మ్యాచ్‌లో ఎనిమిది సిక్సర్లు బాదిన రోహిత్‌.. మరో సిక్సర్‌ కొడితే భారత్‌ తరపున వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌ సరసన చేరతాడు. ఇప్పటివరకూ వన్డేల్లో 194 సిక్సర్లు కొట్టిన రోహిత్‌ శర్మ.. సచిన్‌ సిక్సర్ల రికార్డును చేరేందుకు స్వల్ప దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం వన్డేల్లో సచిన్‌ 195 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా, రోహిత్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత క్రికెటర్ల జాబితాలో సౌరవ్‌ గంగూలీ (190)ను రోహిత్‌ వెనక్కి నెట్టిన సంగతి తెలిసిందే. విండీస్‌తో బుధవారం  ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో సచిన్‌ సిక్సర్లు రికార్డును రోహిత్‌ అధిగమించే అవకాశాలు కనబడుతున్నాయి. కొంతకాలంగా బ్యాటింగ్‌ మంచి ఊపువిూద ఉన్న రోహిత్‌.. విశాఖ వన్డేల్లో కూడా అదే జోరును కొనసాగించే అవకాశం ఉంది. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో మహేంద్ర సింగ్‌ ధోని (217) తొలి స్థానంలో ఉన్నాడు.
జట్టు వివరాలు ..
విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, అంబటి రాయుడు, రిషభ్‌ పంత్‌, ఎంఎస్‌ ధోని, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చహల్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షవిూ, ఖలీల్‌ అహ్మద్‌