నేను విూ పప్పులా కాదు
-నీలాగా ప్రజల సొమ్ముదోచుకొని కారులో తగలబెట్టలేదు
– ఉత్తమ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్8(జనంసాక్షి) : ముందస్తు ఎన్నికలతో తెలంగాణలో రాజకీయం వేడేక్కింది. నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, కౌంటర్స్ ఇవ్వడం మొదలైంది. టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తనదైన శైలిలో స్పందించారు. ‘నేను అమెరికాలో ఉన్నప్పుడు నా పనులు సొంతంగా చేసుకున్నాను. విూ పప్పులా కాకుండా సొంతంగా సంపాదించుకున్నాను. అందుకు నేను గర్వపడుతున్నాను. నీలాగా ప్రజల సొమ్ముదోచుకుని కారులో తగలబెట్టలేదు అంటూ ఉత్తమ్‌కు కేటీఆర్ చురకలింటించారు. 2014 ఎన్నికల్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన కారులో రూ.2 కోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.
అమెరికాలో కేటీఆర్ అంట్లూ తోమాడని ఉత్తమ్, రేవంత్ రెడ్డిలు ఎద్దేవా చేస్తూ కేటీఆర్‌ను విమర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి అధినేత రాహుల్ గాంధీని పరోక్షంగా ప్రస్తావిస్తూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అలాగే ఆపిల్ కంపెనీ వ్యవహారంలో ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ కుంతియా చేసిన వ్యాఖ్యలను మరో ట్వీట్‌లో కేటీఆర్ తిప్పికొట్టారు. ఆపిల్, సామ్సంగ్ లాంటి టెక్ దిగ్గజాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని, అయితే ఐటీ మంత్రి కేటీఆర్ కారణంగా తరలిపోయాయని కుంతియా అన్నారు. ఈ రెండు కంపెనీలు తరలిపోవడానికి కేటీఆర్ అవినీతే కారణమని తీవ్ర ఆరోపణలు చేశారు.
కుంతియా ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ఘాటుగానే స్పందించారు. కుంతియాను స్కాంగ్రెస్ జోకర్‌గా అభివర్ణిస్తూ శనివారం ట్వీట్ చేశారు. ‘ఏఐసీసీ అలియాస్ ఢిల్లీ సుల్తాన్ ఇన్‌ఛార్జి అయిన ఈ జెంటిమేన్ ఏదో చెప్పారు. స్కాంగ్రెస్ జోకర్ మాత్రమే ఇలాంటివి చెప్పగలరు. అజ్ఞానంలోనే ఆనందం ఉంది’ అని పేర్కొన్నారు. ఇక ఆపిల్ సంస్థ గురించి స్పందిస్తూ.. 2016 ఆగస్టులోనే హైదరాబాద్‌లో ఆపిల్ కార్యకలాపాలు మొదలయ్యాయని ట్వీట్‌లో పేర్కొన్నారు. 3,500 మందికి పైగా ఈ సంస్థలో పనిచేస్తున్నారన్నారు. యూఎస్ ఆవల ఉన్న ఆపిల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యలో కూడా హైదరాబాద్‌దే అగ్రస్థానమని గుర్తుచేశారు. మరి దీనికి కుంతియా ఏం సమాధానం చెబుతారో చూడాలి!