నేరాల అదుపులో సీసీ కెమెరాలదే కీలకపాత్ర

– చేర్యాల సీఐ మంచినీళ్ల శ్రీనివాస్
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 06 : నేరాలను నియంత్రించడంలో సీ.సీ కెమెరాలదే కీలక పాత్ర అని చేర్యాల సీఐ మంచినీళ్ల శ్రీనివాస్ వెల్లడించారు. శనివారం మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఆకునూరు గ్రామాన్ని వారు సందర్శించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై గ్రామస్తులతో సమీక్షించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరి బాధ్యతగా ఆకునూరు గ్రామంలో ఆయా కాలనీలు, బజార్లలో ప్రజలు, సంస్థలు స్వచ్ఛందంగా సీ.సీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని ఆయన తెలిపారు. ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, వాటితో 24 గంటలు నిఘా ఉంటుందని, పల్లెలు, గ్రామ పంచాయితీల్లో కెమెరాల ద్వార నేరాలను నియంత్రించడానికి తగినన్ని సీసీ కెమెరాలు లేనందున నేరాలను నియంత్రించడం కష్టతరంగా మారిందని, ప్రతీ ఒక్కరి బాధ్యతగా వ్యక్తిగత భద్రత కోసం ప్రతీ ఒక్కరు వారి సొంత ఖర్చులతో సీసీ కెమెరాలను తాము నివసించే ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. నేరాల నియంత్రణ, కేసుల పరిశోధనలో నిఘా వ్యవస్థ ముఖ్యం అన్నారు. ప్రజల ప్రాణ, ఆస్థి సంరక్షణలో సీసీ కెమెరాలు పాత్ర కీలకం అని చిన్నారుల సంరక్షణే కాకుండా, గుర్తుతెలియని వ్యక్తులు పాల్పడే నేరాలు, దొంగతనం, కిడ్నాప్ లు, హత్యలు, రోడ్డు ప్రమాదాల నేరాలలో నేరస్తులను గుర్తించి వారిపై తగిన సాక్ష్యాధారాలతో అభియోగ పత్రాలు దాఖలు చేయటంలో సిసి కెమెరాల పాత్ర ఎంతో కీలకం అని చెప్పారు. రాత్రి పూట కూడా చీకటిలో పనిచేసే ఇన్ఫ్రారెడ్ వ్యవస్థ కలిగి, 30 రోజుల స్టోరేజ్ కెపాసిటీ కలిగిన డివీఆర్ లతో హై రెజెల్యూషన్ ఉన్న సిసి కెమెరాలను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా నేరస్తులను వెంటనే క్షుణ్ణంగా గుర్తించవచ్చని తెలిపారు. అసాంఘీక కార్యకలాపాలు జరుగుటకు అవకాశం ఉన్న ప్రాంతాలలో సి సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు పోలీసు వారికి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చీపురు రేఖా-మల్లేష్ యాదవ్, ఉప సర్పంచ్ బోయిని పద్మ-బాలయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్,పోలీసు కానిస్టేబుల్లు ఎం. సంపత్, బీ. హనుమంతు గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.