నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ నేతలకు ఊరట

హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్‌ చేసిన నేతలు

న్యూఢిల్లీ,నవంబర్‌13(జ‌నంసాక్షి): నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ నేతలకు ఊరట కలిగింది. ఈ కేసులో విచారణకు సుప్రీం అంగీకరించింది. కాంగ్రెస్‌ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌లు దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించి ఆదాయపన్ను అంచనాల కేసులో సోనియా, రాహుల్‌కు ఊరట కలిగించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించేందుకు కోర్టు ఒప్పుకుంది. సోనియా, రాహుల్‌ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు, మాజీ కేంద్ర మంత్రులు పి.చిదంబరం, కపిల్‌ సిబల్‌ కోర్టులో హాజరయ్యారు. నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించిన కేసులో కేవలం షేర్ల బదిలీని ఆదాయంగా పరిగణించలేమని వారు కోర్టులో వాదించారు. ఈ కేసుకు సంబంధించి ఆదాయపన్ను శాఖకు నోటీసులు జారీ చేయాలని సోనియా, రాహుల్‌ల కౌన్సిల్‌ కోరింది. అయితే ఆదాయపన్ను శాఖ తరఫున వాదించి సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాత్రం నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని వాదించారు. కోర్టు తదుపరి విచారణను డిసెంబరు 4కు వాయిదా వేసింది. ఆ రోజున రాహుల్‌, సోనియాలకు ఆదాయపన్ను శాఖ జారీ చేసిన నోటీసులు చెల్లుతాయో లేదో నిర్ణయిస్తామని తెలిపింది. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక పబ్లిషర్‌ అయిన అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌కు సంబంధించి 2011-12 సంవత్సరంలో వేసిన పన్ను అంచనాల కేసును తిరిగి ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ సోనియా, రాహుల్‌ అప్పీల్‌ దాఖలు చేశారు.