నోబెల్‌కు నేను అర్హున్ని కాను
– కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించే వాళ్లకు ఇవ్వండి
– పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
ఇస్లామాబాద్, మార్చి4(జనంసాక్షి) : శాంతి చర్యల్లో భాగంగా భారత పైలట్ అభినందన్ వర్ధమాన్‌ను విడుదల చేశామని చెబుతున్న పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా సోషల్ విూడియాలో నోబెల్ పీస్ ఫర్ ఇమ్రాన్ ఖాన్ అన్న హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ అవుతున్నది. అయితే దీనిపై ఇమ్రాన్ సోమవారం స్పందించారు. నోబెల్ శాంతి బహుమతికి తాను అర్హుడిని కాను అని ఆయన అన్నారు. అయితే అది ఎవరికి ఇవ్వాలన్నదానిపైనా ఇమ్రాన్ ఓ సూచన చేశారు. నోబెల్ శాంతి బహుమతి అందుకునేందుకు నేను అర్హున్ని కానని, అయితే కశ్మీరీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కశ్మీర్ అంశాన్ని పరిష్కరించే వాళ్లకు ఈ బహుమతి ఇవ్వండని అన్నారు. దీని ద్వారా ఉపఖండంలో శాంతి, మానవాభివృద్ధి జరగాలని కోరుకుంటున్నానని పాక్ ప్రధాని ట్వీట్ చేశారు. ఇమ్రాన్‌కు శాంతి బహుమతి ఇవ్వాలంటూ జరుగుతున్న ఆన్‌లైన్ ప్రచారంలో ఇప్పటికే 3
లక్షల మందికిపైగా సంతకాలు చేశారు. అదేవిధంగా పార్లమెంట్‌లో సభ్యులు తీర్మానం చేశారు. కాగా ఇమ్రాన్ ఖాన్ నోబెల్ శాంతి బహుమతికి తాను అర్హున్ని కాదని చెప్పారు.