న్యూఢిల్లీ ఫలితం ముందుగా వెల్లడి

ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండడమే కారణం
న్యూఢిల్లీ,మే20(జ‌నంసాక్షి): దేశరాజధాని ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలలో ముందుగా న్యూఢిల్లీ, చివరగా ఉత్తర- పశ్చిమ పార్లమెంటు సీటు ఫలితం వెల్లడికానుంది. న్యూఢిల్లీలో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో పోలింగ్‌ స్టేషన్ల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. దీంతో ఫలితం ఇక్కడ ముందుగా వెల్లడి కానుంది.  ఉత్తర-పశ్చిమ సీటు విషయానికొస్తే ఓటర్ల విషయంలో ఇదే అత్యంత పెద్ద లోక్‌సభ స్థానంగా పేరొందింది. అందుకే ఇక్కడ అత్యధిక పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ స్థానంలో ఓటర్ల సంఖ్య 16.15 లక్షలుండగా, పోలింగ్‌ శాతం 56.86గా నమోదైంది. ఇక్కడ 16వ రౌండ్‌తో ఓట్ల లెక్కింపు పూర్తికావచ్చని తెలుస్తోంది. దీంతో ఇక్కడి ఫలితం ముందుగా వెల్లడికావచ్చంటున్నారు. ఇక ఉత్తర-పశ్చిమ సీటు విషయానికొస్తే ఇక్కడ 23.77 లక్షల ఓటర్లుండగా, 58.96 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక్కడి ఫలితం 18-20 రౌండ్ల మధ్య వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.