పంటల ఉత్పత్తిలో భాస్వరం ఒక ప్రధాన పోషకంలాంటిది- మునగాల మండల వ్యవసాయాధికారి బి.అనిల్ కుమార్

 మునగాల మండలంలోని గణపవరం గ్రామంలో డి.ఏ.పి ని తగ్గించి భాస్వరాన్ని కరిగించే బాక్టీరియా వాడకం గురించి మంగళవారం రైతులకు అవగాహణ కల్పించటం జరిగింది. ఈ సందర్భంగా భాస్వరాన్ని కరిగించే బాక్టీరియా వాడకం గూర్చి మునగాల మండల వ్యవసాయాధికారి బి.అనిల్ కుమార్ వివరణ ఇచ్చారు. పంటల ఉత్పత్తిలో భాస్వరం(భా)ఒక ప్రధాన పోషకంలాంటిదని, ఇది పంట పెరుగుదలకు, వేళ్ళు వృద్ధి చెందడానికి దోహదపడుతుందని తెలిపారు. రైతులు భాస్వరాన్ని డి.ఎ.పి., కాంప్లెక్స్ ఎరువుల రూపంలో వినియోగిస్తారన్నారు. భాస్వరం పోషకాన్ని భూమిపై చల్లినప్పుడు అది మొక్కలకు అందుబాటుకాని రూపంలోకి మారిపోతుందని తెలిపారు. భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువు వాడకం రైతులకు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. మొదటిది సాగు ఖర్చు తగ్గుతుందని, రెండవది నేల భౌతిక లక్షణాలను పునరుద్ధరిస్తుందన్నారు. మార్కెట్లో సుళువుగా లభ్యమవుతుందని తెలిపారు. అంతేగాక భాస్వరాన్ని కరిగించే బాక్టీరియాతో ప్రయోజనాలు, లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరాన్ని ఈ బాక్టీరియా జాతులు లభ్య రూపంలోకి మార్చి మొక్కలకు అందిస్తాయని, భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా(పి.ఎస్.బి)ఒక ప్యాకెట్ వాడితే, హెక్టారుకు ఒక బ్యాగ్ డిఎస్పీ వినియోగాన్ని ఆదా చేసుకోవచ్చని తెలిపారు. పంట సాధారణ దిగుబడిలో ఎటువంటి మార్పు ఉండదు. భాస్వరాన్ని కరిగించే బాక్టీరియాను అన్ని పంటలకూ వినియోగించవచ్చని, ఈ జీవన ఎరువులను రెండు పద్ధతుల్లో వినియోగించవచ్చన్నారు.

*భూమి / నేలపై జల్లడం, విత్తనశుద్ధి(భూమిలో వేసే పద్ధతి):* వరి, మొక్కజొన్న, ఇతర పంటలలో నేలలో భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువు (బ్యాక్టీరియా)ను వాడుకోవచ్చు. ఎకరానికి 2 కిలోల ఘన జీవన ఎరువు లేదా 200 మి.లీ. ద్రవ జీవన ఎరువును సుమారుగా 100-200 కిలోల పశువుల ఎరువుతో గానీ, వానపాముల ఎరువుతో గానీ లేదా ఇతర సేంద్రియ ఎరువులతో గానీ కలిపి పంట పొలాల్లో వేయాలి. ఎట్టి పరిస్థితులలోను పంట పొలంలో చేపట్టే మొదటి అంతరకృషి చేయడానికి ముందుగా జీవన ఎరువుల వాడకాన్ని ముగించాలి. వరిలో నాటు వేసిన తర్వాత 3-7 రోజుల వ్యవధిలో సేంద్రియ ఎరువుతో కలిపి వెదజల్లాలి.

*విత్తనానికి పట్టించే పద్ధతి :* ఒక ఎకరానికి సరిపడే విత్తనాన్ని 200 గ్రా. ఘన జీవన ఎరువు లేదా 200 మి.లీ. ద్రవ జీవన ఎరువును సమ మోతాదులో 10 శాతం చెక్కర లేదా బెల్లం ద్రావణానికి కలిపి విత్తనం చుట్టూ సమానంగా పట్టించి 30నిమిషాలు నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. జీవన ఎరువులను విత్తే ముందు మాత్రమే విత్తనాలకి పట్టించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారి ముస్తఫా, రైతులు జితేందర్ రెడ్డి, లింగారెడ్డి, కోటిరెడ్డి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.