పండిట్‌ నెహ్రూకు జాతి ఘన నివాళి

శాంతివనంలో శ్రద్దాంజలి ఘటించిన సోనియా, రాహుల్‌

న్యూఢిల్లీ,నవంబర్‌14(జ‌నంసాక్షి): భారత తొలి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి సందర్భంగా జాతి ఆయనకు ఘనంగా నివాళి అర్పించింది. ఆయన సేవలను స్మరించుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ,సోనియాగాంధీ సహా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. నెహ్రూ ఈ దేశానికి చేసిన సేవలు మరువలేనివి అంటూ కొనియాడారు. నెహ్రూ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఆయనకు నివాళులర్పించారు. దిల్లీలోని శాంతివనానికి వెళ్లి నెహ్రూ స్మారకం వద్ద అంజలి ఘటించారు. పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కూడా నెహ్రూకు నివాళులర్పించారు. మన తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నానని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్‌ను అగ్రస్థానానికి చేర్చాలన్న ఆయన అభిలాష ఆచరణీయం. జాతీయభద్రత, విదేశాంగ విధానంలో నెహ్రూ ముద్ర మరచిపోలేనిది. పిల్లలందరికీ జాతీయ బాలల దినోత్సవం శుభాకాంక్షలు. ప్రాథమిక విద్య పిల్లల హక్కు అనే విషయాన్ని అందరూ గుర్తించాలి. వారికి సంస్కారంతో కూడిన విద్యను అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత. దాన్ని అందరూ ఆచరించాలి. అదే పిల్లలకిచ్చే బాలల దినోత్సవ బహుమానం, నెహ్రూకిచ్చే నిజమైన నివాళి అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మన తొలి ప్రధాని పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి. స్వాతంత్రోద్యమంలో, ప్రధానిగా ఆయన ఈ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళి అర్పించారు. స్వాతంత్యం, ప్రజాస్వామ్యం, లౌకిక, సామ్యవాదానికి పునరంకితమవడమే జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు మనమిచ్చే ఘన నివాళి. ఈ విలువలనే ఆయన ఎంతగానో విశ్వసించారు. వాటి కోసం పోరాడారు. ఇవే మన దేశాన్ని కలిసికట్టుగా ఉంచేందుకు ఎంతగానో దోహదపడుతాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు.