పంపిణీకి టీకా సిద్ధం
– రాష్ట్రంలో తొలి కరోనా టీకా సఫాయి కర్మచారికే
– రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
హైదరాబాద్,జనవరి 13(జనంసాక్షి): తెలంగాణలో మొదటి టీకా సఫాయి కర్మచారికే వేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16 నుండి కొవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రారంభం కానుంది. కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్ చేరిన నేపథ్యంలో మంత్రి ఈటల మాట్లాడుతూ.. రాష్ట్రానికి బుధవారం 20 వేల కొవాగ్జిన్ డోసులు వచ్చినట్లు తెలిపారు. 139 సెంటర్లలో మొదటి రోజు ఒక్కో సెంటర్‌లో 30 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. మొదట్లో ప్రభుత్వ హెల్త్ కేర్ వర్కర్లకు, తర్వాత ప్రైవేటు హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. తర్వాత రోజు 50, ఆ తర్వాత 100 ఇలా అంచెల వారీగా వాక్సిన్ డోసులను పెంచనున్నట్లు వెల్లడించారు. వ్యాక్సిన్ కోసం తెలంగాణలో ఇప్పటి వరకు 3 లక్షల 30 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు మంత్రి తెలిపారు. టీకా ఇచ్చిన తర్వాత ఖాళీ వాక్సిన్ వాయిల్‌ను రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కాసేపట్లో వ్యాక్సిన్ కోఠి నుంచి జిల్లాలకు తరలనున్నట్లు చెప్పారు. ఇన్సులేటర్ వాహనాలు హైదరాబాద్ నుంచి జిల్లాలకు ఎస్కార్ట్ వాహనాలతో వెళ్లనున్నాయి. టీకా తీసుకునే వాళ్ళ అనుమతి, సంతకం తీసుకున్నాకే డోసులు అందజేయనున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో ప్రతినిధులందరూ భాగస్వాములై ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ నుంచి 11 నగరాలకు కొవాగ్జిన్
దిగ్గజ ఔషధ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా తొలి విడత డోసులు బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి 11 నగరాలకు బయల్దేరాయి. ఇప్పటికే టీకా దిల్లీ చేరుకుంది. 55 లక్షల కొవాగ్జిన్ డోసులు రేపటికల్లా వివిధ రాష్ట్రాలకు చేరనున్నాయి. దిల్లీ, పట్నా, లఖ్‌నవూ, చెన్నై, జైపుర్, బెంగళూరు, విజయవాడ,గువహాటి, పుణె, కురుక్షేత్ర, భువనేశ్వర్‌లకు టీకా డోసులు తరలించనున్నారు. వీటిలో 38.5 లక్షల డోసులను కేంద్రం కొనుగోలు చేయగా 16.5 లక్షల డోసులను భారత్ బయోటెక్ ప్రభుత్వానికి ఉచితంగా అందిస్తోంది. ఎయిరిండియా విమానం ఏఐ559 విమానంలో బుధవారం ఉదయం 6.40 గంటలకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొవాగ్జిన్ టీకా డోసులు 9 గంటలకు దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరాయి. ఈ మేరకు విమానాశ్రయ అధికారులు తెలిపారు. అనంతరం టీకాలను భద్రపరచేందుకు రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (ఆర్‌జీఎస్‌ఎస్‌హెచ్)కు తరలించనున్నారు.” కొవాగ్జిన్ టీకాలు సుమారు ఒంటిగంట ప్రాంతంలో ఆస్పత్రికి చేరనున్నాయి. వచ్చిన టీకాల నుంచి మేము 20వేల డోసులు తీసుకుంటున్నట్లు ప్రభుత్వానికి వెల్లడించాం” అని ఆస్పత్రి డైరక్టర్ బీఎల్ షేర్వాల్ తెలిపారు. మొదటి దశలో భాగంగా 55లక్షల వ్యాక్సిన్‌లను పంపే లక్ష్యంతో ఉన్నామని భారత్ బయోటెక్ తెలిపింది. మంగళవారం ఆర్‌జీఎస్‌ఎస్‌హెచ్ 2.64 లక్షల కొవిషీల్డ్ టీకాలను సేకరించి, భద్ర పరచింది. సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి వచ్చిన 22 బాక్సుల్లో కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను సేకరించామని ఆస్పత్రి అధికార ప్రతినిధి వెల్లడించారు.భారత్‌లో అభివృద్ధి చేసిన కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అత్యవసర వినియోగ అనుమతిని పొందాయి. వీటి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఎదురవ్వవని నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఒక సమావేశంలో తెలిపారు. భారత్‌లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను జనవరి 16నుంచి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తౌెనట్లు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్‌భూషణ్ తెలిపారు.