పథకాల అమలు కోసం అదనపు భారం తప్పదు

భారాన్ని అధిగమించేందుకు కానరాని ప్రయత్నాలు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన పథకాలు అమలులోకి వస్తే ప్రభుత్వంపై అదనపు భారం తప్పదు. దాన్ని ఏ విధంగా అధిగమిస్తారన్నది రాబోయే ప్రభుత్వాలు చూసుకుంటాయి. జీఎస్‌టీపైనే ప్రభుత్వం ఆశలన్నీ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 3.3 శాతానికి కట్టిడి చేయడం ప్రభుత్వ లక్ష్యం. రైతులకు ఆదాయ మద్దతు పథకం డిసెంబరు నుంచే అమలు చేయడం వల్ల ద్రవ్యలోటు

దీన్ని మించగలదని ప్రభుత్వమే చెబుతోంది. అది ఎంతమేరకు పెరుగుతుందన్నది పెట్టుబడుల ఉపసంహరణ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంది. మొత్తం విూద ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్టాల్లోన్రి అనుభవాలను పరిగణనలోకి తీసుకుని సామాన్యులను ఆకర్షించడానికి మోదీ పెద్ద ప్రయత్నమే చేశారు. ఇది ఎంతమేరకు ఫలించిందో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చెబుతాయి. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినప్పటికీ.. పన్ను శ్లాబ్‌లను మాత్రం మార్చకపోవడం గమనార్హం. ఆదాయ పరిమితిని పెంచడం వల్ల 3 కోట్ల పన్ను చెల్లింపుదారులు ప్రయోజనం పొందుతారని చెబుతున్నప్పటికీ.. స్థూలంగా ఉద్యోగులు పొందే ప్రయోజనం పెద్దగా లేదు. ఉదాహరణకు రూ.7.5 లక్షలు వార్షిక ఆదాయం కలిగిన ఉద్యోగులు స్టాండర్డ్‌ డిడెక్షన్‌ వల్ల రూ.2,000, సర్‌ఛార్జీ, విద్యాసెస్‌లో రూ.80 మేరకే ప్రయోజనం పొందారు. పోస్టాఫీసు పొదుపు పథకాలపై వచ్చే వడ్డీపై టీడీఎస్‌ పరిమితిని పెంచడం, అద్దె ఆదాయం పరిమితిని పెంచడం, సొంత ఇంటి ఆదాయానికి మినహాయింపును రెండిళ్లకు చేయడం వంటి కొన్ని చర్యలు ఊరట కలిగించేవే. ఇవి గృహ రంగానికి ఊతం ఇస్తాయి. అసంఘటిత రంగంలోని శ్రామికులకు మెగా పింఛను పథకాన్ని బడ్జెట్‌లో ప్రకటించారు. నెలకు రూ.100 చెల్లిస్తే.. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 పింఛను చెల్లిస్తారు. ఇకపోతే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఏవిూ చెల్లించకుండానే పింఛను పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన కార్మిక పింఛను పథకం విధి విధానాలను పరిశీలించిన తర్వాత కానీ ఇది ఎంతమేరకు ప్రయోజనం చేకూరుస్తుందో చెప్పలేం. ఆచరణలో అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశమూ ఉంది. ఇక, పథకాల ద్వారా ప్రజలకు చేరే నగదు కారణంగా గ్రావిూణ ప్రాంతంలో వినియోగం ఒక్కసారిగా పెరిగి, మొత్తం వినియోగానికి ఆధారం అవుతుంది. పెద్ద నోట్లరద్దు, జీఎస్‌టీ తదితర నిర్ణయాలతో ఆర్థిక వృద్ధిరేటు కుంటుపడి మోదీపై వచ్చిపడిన కళంకాన్ని తొలిగించుకోవడానికి ఈ బడ్జెట్‌ ఉపయోగపడవచ్చు. గత కొద్ది నెలలుగా మందగించిన వినియోగ ప్రవృత్తిని పెంచే చర్యల కోసం ఆర్థిక వ్యవస్థ ఎదురు చూస్తోంది. వినియోగం పెరగడం స్టాక్‌ మార్కెట్‌కు కూడా ఉత్తేజాన్ని ఇస్తుంది. దీంతో పరిశ్రమ వర్గాల మద్దతు కూడా మోదీ పొందొచ్చు.