పప్పుశనగ విత్తన వ్యాపారుల దోపిడీ
రైతుల అవసరాలను క్యాష్ చేసుకున్న వ్యాపారులు
అనంతపురం,అక్టోబర్13(జనంసాక్షి): నల్లరేగడి భూములున్న రైతులు 80 శాతం మంది రబీలో పప్పశనగ పంట సాగు చేపట్టారు. కళ్యాణదుర్గం, బెళుగుప్ప, కంబదూరు తదితర మండలాల్లో పప్పుశనగ పంటను సాగు చేస్తున్నారు. పంటకు అనువుగా వర్షాలు పడడంతో సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. పప్పశనగ విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్నప్పటికీ రైతుల అవసరాలకు అవి సరిపోలేదు. దీంతో ప్రయివేటు వ్యక్తల వద్ద విత్తనాలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రైతుల ఇబ్బందులను ఆసరాగా తీసుకున్న కొంతమంది వ్యాపారస్తులు విత్తనాలను అప్పు పేరుతో అధిక ధరలకు అంటగట్టారు. అధికారులు స్పందించి వ్యాపారుల సాగిస్తున్న దోపిడీ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పప్పుశనగ రైతులు కోరుతున్నారు. మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు రైతులకు అమ్ముతున్నారు. పలు మండలాల్లో గతేడాది రబీసాగు సమయంలో వర్షం పడకపోవడంతో పంట సాగుచేయక పొలాలు బీళ్లుగా మారాయి. ఈసారి రబీసాగుకు ముందస్తు వర్షాలు వస్తుండడంతో రైతులు రబీసాగుకు సన్నద్ధమయ్యారు. గతేడాది
పంట వేయకపోవడంతో విత్తనాలు నిల్వలేక ఈసారి సాగుకు విత్తనాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. మరోవైపు విత్తనం తీసుకున్న నాటి నుంచి అప్పు చెల్లించేంత 2శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. ప్రయివేటు వ్యాపారస్తులతో అధిక ధరలకు విత్తనం తీసుకున్న రైతులు పంటను కూడా వారికే అమ్మాలని ముందస్తు ఒప్పందం చేసుకుంటున్నారు. పంట చేతికొచ్చిన సమయంలో వ్యాపారులు ఎంత ధర నిర్ణయిస్తే అంతకే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. విత్తనం కోసం వ్యాపారులు కింటా రూ.ఏడు వేలకు అమ్ముతున్నారు. పంట చేతికొచ్చిన తరువాత అదే వ్యాపారులు రైతుల నుంచి క్వింటా రూ.ఐదు వేలకు మించి కొనుగోలు చేయడం లేదు. వ్యాపారులు వారికి అనుకూలంగా ధరలను నిర్ణయించి రైతుల నడ్డి విరుస్తున్నారు. ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో సబ్సిడీ విత్తనాలు అందజేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని రైతులు చెబుతున్నారు.