పరిశ్రమల పేరుతో కాలుష్యాన్ని అండగడతారా?

పరిశ్రమల ఏర్పాటుపై సిపిఎం నేతల ఆందోళన
విజయవాడ,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): అభివృద్ధి పేరుతో చంద్రబాబు సర్కారు వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ కాలుష్యాన్ని ప్రోత్సహిస్తున్నారని సిపిఎం నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నా, భూములు ఇవ్వమని అంటున్నా బలవంతంగా భూసేకరణకు పాల్పడుతున్నారని అన్నారు. పరిశ్రమల పేరుతో అరాచకం సృష్టిస్తే తమ పార్టీ చూస్తూ వూరుకోదని అన్నారు. పశ్చిమలో ఆక్వా ఫుడ్‌ పేరిట , విశాఖ మన్యంలో పెట్రో వర్సిటీ పేరుతో దారుణలకు ఒడిగడుతున్నారని అన్నారు. ఇటు మన్యం, అటు మైదాన ప్రాంతాల ప్రజలను ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని పేర్కొన్నారు.  వామపక్షాలు పోరాడి సాధించిన అటవీ హక్కుల చట్టం, ఉపాధి హావిూ పథకాలను తుంగలో తొక్కుతున్న వైనాన్ని పేదలు గుర్తిస్తున్నారన్నారు. పారిశ్రామిక వేత్తలకు కొమ్ము కాసే విధానాలతో ప్రజా వ్యతిరేక
విధానాలకు పాల్పడితే చూస్తూ వూరుకోమని హెచ్చరించారు. గిరిజన ప్రాంతాల్లో అపారమైన బాక్సైట్‌ ఖనిజాన్ని తరలించేందుకు పాలకులు కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. మావోయిస్టుల బూచిని చూపించి పోలీసు శిబిరాలు ఏర్పాటు చేసి బాక్సైట్‌ను తరలించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయన్నారు. ప్రస్తుతం గిరిజనులు వ్యాధులతో అల్లాడుతుంటే వైద్య సేవలు అందించడంలో విఫలమైనట్లు పేర్కొన్నారు. పోలీసు శిబిరాలకు చేసే ఖర్చుతో వేల మంది మన్యం వాసులకు విద్య, వైద్యం, తాగు, సాగు నీరు అందించవచ్చని చెప్పారు. వ్యాధుల వచ్చిన తరువాత సేవలు పేరుతో హంగామా చేస్తున్న ప్రభుతం ఏజెన్సీలో పరిస్థితులను ముందే ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. గిరిజనులను చదువుకు దూరం చేసేందుకు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే నెపంతో 11 మండలాల్లో సుమారు 60 ప్రాథమిక పాఠశాలలను మూసివేశారని విమర్శించారు.ఇందు కోసం ప్రజా సంఘాల సహకారంతో ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని వెల్లడించారు.