పవన్ దశదిశ, స్థిరత్వంలేని నాయకుడు
– అన్న పార్టీని కాంగ్రెస్‌లో కలిపినప్పుడు నీ పౌరుషం ఏమైంది?
– ఏపీ మంత్రి జవహర్
అమరావతి, అక్టోబర్10(జనంసాక్షి) : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దశ దిశ, స్థిరత్వం లేని నాయకుడని మంత్రి జవహర్ విమర్శించారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడారు.. ఆనాడు పవన్ సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడు పవన్ పౌరుషం ఏమైందని ప్రశ్నించారు. అలాగే గత ఎన్నికల్లో కేసీఆర్ తాటతీస్తానని చెప్పి ములాఖాత్ కాలేదా అంటూ జవహర్ నిలదీశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 15నిమిషాలకు ఒక అత్యాచారం, హత్య జరుగుతోందని, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 52వేల అత్యాచారాలు జరిగాయని మంత్రి విమర్శించారు. దేశంలో జరుగుతున్న ఘోరాలపై పవన్ ఎందుకు ప్రశ్నించరని జవహర్ అన్నారు. బీజేపీకి ఏపీలో రాయబారిగా పవన్, జగన్‌లు పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం అండగా ఉంటానని మోసం చేసి సహకారం ఇవ్వకపోయినా.. సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టిస్తూ ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. అలాంటిది పవన్ కళ్యాణ్‌కు ఇవన్నీ కనిపించటం లేదా అని ప్రశ్నించారు. మూడేళ్లు చంద్రబాబు గొప్ప అని పొగిడిన పవన్ కళ్యాణ్, మోదీతో చంద్రాబు దూరం కాగానే చేదయ్యాడా అంటూ నిలదీశారు. కేవలం బీజేపీ ఆడిస్తున్న పావుల్లో పవన్ కళ్యాణ్ ఒకరని అన్నారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీలకు పెద్దపీట వేసిందన్నారు. ఎస్సీలనుఅ న్ని విధాలుగా ఆదుకున్న ఘనత తెదేపా ప్రభుత్వానికే దక్కుతుందని, అలాంటి తెదేపా ఎస్సీలను విస్మరిస్తుందని అనడం పవన్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు.