పవన్‌.. నోరు అదుపులో పెట్టుకో

– ఇష్టారీతిగా మాట్లాడితే గుణపాఠం చెబుతాం
– పవన్‌ ఏనాడైనా ఢిల్లీ వెళ్లి ఉద్యమం చేశాడా?
– చంద్రబాబుతో కలిసి పవన్‌ డ్రామాలాడుతున్నాడు
– వైసీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని
ఏలూరు, అక్టోబర్‌17(జ‌నంసాక్షి) : పవన్‌ కళ్యాణ్‌ కనీస పరిజ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని, మరోసారి జగన్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, తగిన గుణపాఠం చెబుతామని వైసీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని అన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జగన్‌ను  ఫ్యాక్షనిస్టుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్న పవన్‌ కల్యాణ్‌ మానసిక స్థితి సరిగా లేదని వ్యాఖ్యానించారు. రాజకీయంగా జగన్మోహన్‌ రెడ్డి ఎదుగుదలను ఓర్వలేకనే కాంగ్రెస్‌, టీడీపీలు ఆయనపై తప్పుడు కేసులు పెట్టాయని అన్నారు. తమ అధినేతపై అసత్య ఆరోపణలు ఆపకపోతే పవన్‌ కల్యాణ్‌కు, జనసేన పార్టీకి ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు. ప్రత్యేక ¬దా కోసం పోరాడుతున్నానని చెప్పుకుంటున్న పవన్‌ ఏనాడైనా ఢిల్లీ వెళ్లి ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు పిలవలేదు కాబట్టే ఢిల్లీ వెళ్లలేదనే పవన్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు. ఆంధప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వ అవినీతిని పక్కనబెట్టి వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేయడమేంటని నాని మండిపడ్డారు. టీడీపీని మరోసారి అధికారలోకి తేవడానికే పవన్‌ కల్యాణ్‌ పనిచేస్తున్నారని ఆరోపించారు. పవన్‌ ఉద్ధానం, మూలలంక ప్రాంతాల్లో పర్యటించి ఏ సాంధించారనీ ప్రశ్నించారు. బాధితుల పక్షాన నిలబడి టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం లేదా అని ఎద్దేవాచేశారు. పర్యటనల పేరుతో పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబుతో కలిసి డ్రామా ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. వారసత్వ రాజకీయాలపై తెగ స్పీచ్‌లిస్తున్న పవన్‌ సినిమాల్లోకి ఎలా వచ్చారనీ, ఆయన వారసత్వంగా ఇండస్ట్రీకి రాలేదా అని  ప్రశ్నించారు.

తాజావార్తలు