పశ్చిమబంగను తాకిన ఫోనీ తుఫాన్‌

70 నుంచి 80 కిలోవిూటర్ల వేగంతో గాలులు
భారీవర్షంతో పాటు నేలకూలిన చెట్లు
కోల్‌కతా,మే4(జ‌నంసాక్షి): ఒడిశాను అతలాకుతలం చేసిన ఫొని అతి తీవ్రతుపాను క్రమంగా బలహీనపడి పశ్చిమ్‌బంగాను తాకింది.ఒడిశాను బీభత్సం సృష్టించిన ఫణి తుపాన్‌ శనివారం మధ్యాహ్నం నాటికి పశ్చిమబెంగాల్‌ తీరాన్ని దాటింది. అర్దరాత్రి పన్నెండున్నర గంటలకు బెంగాల్‌ తీరాన్ని తాకిన తుపాన్‌ వల్ల ఖరగ్‌పూర్‌ నగరంలో గంటలకు 70 నుంచి 80 కిలోవిూటర్ల వేగంతో గాలులు వీచాయి. తుపాన్‌ పశ్చిమబెంగాల్‌ లోని హుగ్లీ జిల్లా ఆరాంబాగ్‌ నడియా విూదుగా బంగ్లాదేశ్‌ వైపు పయనిస్తోంది. ఫణి తుపాన్‌ క్రమేణా బలహీనపడుతూ బంగ్లాదేశ్‌ వైపు వెళుతోంది. ఈ తుపాన్‌ ప్రభావం వల్ల బెంగాల్‌ కోస్తా తీరంలోని దిఘా, మందర్‌ మని, తాజ్‌ పూర్‌, సందేశ్‌ ఖలీ, కొంటాయ్‌, ఖరగ్‌ పూర్‌ నగరాల్లో భారీవర్షంతో పాటు చెట్లు నేలకూలాయి. ఖరగ్‌ పూర్‌ నగరంలో 95 మిల్లీవిూటర్ల వర్షపాతం నమోదైంది. తుపాన్‌ గాలుల వల్ల ప్రమాదాలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.  శుక్రవారం ఉదయం 8.45 సమయంలో  పూరీకి దక్షిణంగా వద్ద తీరం దాటిన ఫొని తుపాన్‌ ఈశాన్య దిశగా ప్రయాణించి ఈ రోజు ఉదయం బెంగాల్‌లోకి ప్రవేశించింది. గంటకు 90 కిలోవిూటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. శుక్రవారం ఉదయం తీరాన్ని దాటే క్రమంలో 230 కిలోవిూటర్ల వేగంతో వీచిన భీకర గాలులు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ఒడిశాతోపాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై తీవ్ర ప్రభావం కనిపించింది. ముఖ్యంగా
పూరీతోపాటు మరో నాలుగు జిల్లాలు దెబ్బతిన్నాయి. చెట్లు, సెల్‌టవర్లు నేలకొరిగాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది.  ఒడిశాలో ఆరు లక్షల హెక్టార్లు, ఉత్తరాంధ్రలోని రెండు జిల్లాల్లో సుమారు 1500 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఒడిశాలో ఆరుగురు మృతి చెందగా.. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో చలిగాలుల తీవ్రతకు వృద్ధురాలు చనిపోయింది.