పాక్‌లో భూకంపం

– ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు
న్యూఢిల్లీ, జూలై 12 (జనంసాక్షి) : అఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్‌ పర్వత ప్రాంతంలో ఏర్పడిన భారీ భూకంపం పొరుగు దాని పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో తీవ్ర ప్రభావం చూపింది. దీని ప్రభావం మన ఉత్తర భారతదేశంలోనూ కనిపించి భూమి కంపించిందంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. అఫ్ఘనిస్తాన్‌ సరిహద్దుల్లో ఈ భూ ప్రకంపనలు సంభవించడంతో అక్కడి జనావాసాల్లో దీని ప్రభావం కనిపించలేదు. కానీ, ఈ ప్రాంతంపాకిస్తాన్‌కు అత్యంత సమీపంగా ఉండడం వల్ల, పాకిస్తాన్‌లోని పంజాబ్‌, ఖైబర్‌ ఫక్తున్‌ ఖ్వా ప్రాంతాల్లో తీవ్ర నష్టం సంభవించింది. ఇక్కడ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.3గా నమోదైంది. రాత్రి ఏడు గంటల సమయంలో ఐదు సెకండ్లపాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడం మొదలు కావడంతో ప్రజలు భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది. అక్కడ సంభవించిన భూ ప్రకంపనల ప్రభావం ఉత్తర భారదేశానికి కూడా చేరడంతో ఇక్కడ కూడా భూమి స్వల్పంగా కంపించినట్లు అధికారులు తెలిపారు.