పాక్‌ ప్రోద్బలంతోనే కాశ్మీర్‌ రాజకీయాలు

రాంమాధవ్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ కాశ్మీర్‌ పార్టీలు

వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటూ రాం మాధవ్‌ ట్వీట్‌

శ్రీనగర్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): పాకిస్తాన్‌ ప్రమేయంతోనే జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీలు చేతులు కలిపాయంటూ బీజేపీ జనరల్‌ సెక్రటరీ, జమ్మూకశ్మీర్‌ బీజేపీ ఇంచార్జ్‌ రామ్‌ మాధవ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆయన ఆరోపణలపై జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఒమర్‌ అబ్దుల్లా ఇవాళ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ నేత తన ఆరోపణలను నిరూపించుకోవాలనీ.. లేకుంటే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బుధవారం రాత్రి ఉన్నపళంగా జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అసెంబ్లీని రద్దు చేయడం సరైన నిర్ణయమేనంటూ రామ్‌ మాధవ్‌ గవర్నర్‌ను వెనకేసుకొచ్చారు. దాయాది దేశం ఆదేశాల మేరకే పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీలు గత నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాయని ఆరోపించారు. కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాజాగా వారికి సరిహద్దు అవతలి నుంచి ఆదేశాలు వచ్చినట్టున్నాయి. వాళ్ల చర్యల వల్లే గవర్నర్‌ ఈ మొత్తం వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు… అని రామ్‌ మాధవ్‌ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కొద్ది సేపట్లోనే అబ్దుల్లా ట్విటర్‌ వేదికగా స్పందించారు. రామ్‌ మాధవ్‌ తన ఆరోపణలను నిరుపించుకోవాలనీ, లేకుంటే క్షమాణలు చెప్పడానికి తగిన మనిషిగా మిగిలిపోతారంటూ ధ్వజమెత్తారు. ఎన్‌ఐఏ, రా, ఇంటిలిజెన్స్‌ బ్యూరో లేక విూ పంజరంలో చిలక సీబీఐతో విచారణ చేయించి ఆధారాలు ప్రజలముందు పెట్టండి. కపట రాజకీయాలు మానుకోండి అంటూ హితవు పలికారు. దమ్ముంటే ఆ ఆరోపణలు రుజువు చేయాలని సవాల్‌ విసిరారు. బయటి వత్తిడి ఏదీ లేదని ఒమర్‌ సవాల్‌ చేయడంతో.. బీజేపీ నేత రామ్‌ మాదవ్‌ వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ట్వీట్‌ చేశారు. భవిష్యత్తులో పీడీపీ, ఎన్సీ పార్టీలు కలిసి పోటీ చేయాలని సూచించారు. తాను చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయమైనవని, అవి వ్యక్తిగతమైనవి కావన్నారు.