పాఠశాలల్లో మొక్కల పెంపకం తప్పనిసరి

హరిత కేంద్రాలుగా వాటిని అభివృద్ది చేయాలి: కలెక్టర్‌

జనగామ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఈ ఏడాది హరిత పాఠశాలల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలనే ప్రభుత్వం నిర్ణయం మేరకు జిల్లాలో అన్ని పాఠశాలలు, విద్యాసంస్థల్లో మొక్కలునాటేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ టీ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. ప్రతి పాఠశాలలో విధిగా మొక్కలు నాటించి వాటిని సంరక్షించేలా విద్యార్థలును బాధ్యులగా చేయాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని కలెక్టర్‌ అన్నారు. ఆకుపచ్చ తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. చెట్లను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. అధికారులు అంకిత భావంతో పనిచేసి హరితహారాన్ని విజయవంతం చేయాలన్నారు.ప్రతి మండలంలో 40వేల మొక్కలు నాటాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా నర్సరీలో అన్ని మొక్కలను పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ ఊరిలో, తండాల్లో మొక్కలు నాటాలన్నారు. ప్రజలను హరితహారంలో భాగస్వామ్యం చేయాలన్నారు. ఇదిలావుంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పనులను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అన్నారు. ఇటీవల అధికారులతో మిషన్‌ భగీరథపై సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన నాటికి పనులు పూర్తి కావాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సైతం మిషన్‌ భగీరథ నీళ్లు అందించాలని, ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. గ్రామాల వారీగా పెండింగ్‌ పనులను గుర్తించాలని సూచించారు. ప్రత్యేకాధికారులు సైతం విూషన్‌ భగీరథ పనుల్లో శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. గ్రామ పంచాయతీ తరఫున ప్రభుత్వ పథకాలపై ప్రతీ రోజు మైక్‌లో చెప్పాలని అధికారులకు సూచించారు.