పారిశుద్ద్య కార్మికుల పొట్టకొట్టేజీవో రద్దు చేయాలి

సమస్యల పరిష్కారంలో బాబు విఫలం: సిఐటియు
విశాఖపట్టణం,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): మున్సిపాలిటీల్లో కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి లేకుండా చేయడానికి
చంద్రబాబునాయుడు ప్రభుత్వం 2015 జులైలో తెచ్చిన ఈ జిఒను తక్షణమే రద్దుచేయాలని సిఐటియు జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు. కేంద్రంపై పోరాటం ఏస్తున్న చంద్రబాబు రాష్ట్ర సమస్యలను మాత్రం విస్మరించారని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 5 వేల మంది ఉపాధి హావిూ ఫీల్డ్‌ అసిస్టెంట్లను, హౌసింగ్‌ కార్పొరేషన్‌లో 2 వేల మందిని తొలగించారని, వారిలా మున్సిపాల్టీ కార్మికులను తొలగించాలని చూస్తే సాగవన్నారు. ఇదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్‌ కార్మికులు చంద్రబాబు సంగతి తేల్చుతారని చెప్పారు. 240 రోజులు పనిచేస్తే కార్మికులను రెగ్యులర్‌ చేయాలని చట్టం ఉంటే, 20 ఏళ్లుగా కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న వీరిని ఎలా తొలగిస్తారన్నారని ప్రశ్నించారు. దళితులు, బడుగు
బలహీన వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని చెప్పే చంద్రబాబునాయుడు, దళిత, పేద తరగతులకు చెందిన మున్సిల్‌ కాంట్రాక్టు కార్మికులను తొలగించే కుట్ర చేయడం భావ్యమా అని ప్రశ్నించారు. గతంలో జన చైతన్య, స్కీమ్‌, ప్యాకేజీ పద్ధతులు ప్రవేశపెట్టి పారిశుధ్య కార్మికుల ఉపాధికి హాని తలపెట్టగా కార్మికులంతా ఐక్యంగా పోరాడి వాటిని రద్దుచేయించారని గుర్తు చేశారు. విశాఖనగరం క్లీన్‌ అండ్‌ గ్రీన్‌లో ప్రథమ స్థానంలో ఉందని జివిఎంసి కమిషనర్‌ అవార్డులు అందుకుంటున్నారంటే కారణం ఇక్కడ పనిచేసే పారిశుధ్య కార్మికుల కృషేనని మరువరాదని గుర్తుచేశారు.